అన్నను హతమార్చిన తమ్ముడు
మానవత్వం మంటగ లిసి మనిషిలోని మృగం బయటపడింది. చిన్ననాటి నుంచి కలిసిమెలిసి గడిపిన క్షణాలు.. సరదాగా ఆడుకున్న సంఘటనలేవీ ఆ సమయంలో గుర్తురాలేదు. కసి కమ్మేసిన కఠిన హృదయానికి అన్నాదమ్ముల అనుబంధం.. అప్యాయతానురాగాలేవీ కనిపించలేదు. అన్నను అంతం చేయాలనే పగ తమ్ముడిని హంతకుడిగా మార్చింది.. అన్న ఉసురు తీసింది.
ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు.. ముప్పయింది. అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు రగిల్చింది. ఉన్మాదిగా మారిన తమ్ముడు నిద్రపోతున్న అన్నను గొడ్డలితో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ సంఘటన సోమవారం అర్ధరాత్రి వర్గల్ మండలం అంబర్‌పేటలో జరిగింది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి సీఐ వెంకట య్య, మృతుని తల్లి సుగుణమ్మ, బంధువుల వివరాలిలా ఉన్నా యి.
అంబర్‌పేటకు చెందిన శ్యామల నర్సయ్య, సుగుణమ్మ దంపతులకు ఎల్లం (24), గణేష్ అలియాస్ సాధు (22) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కూతురు కవితకు వివాహం జరగగా, కొడుకులకు పెళ్లిళ్లు కాలేదు. పెద్ద కొడు కు ఎల్లం శాకారం సమీప పరిశ్రమలో కార్మికునిగా పనిచేస్తూనే బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కొడుకు గణేష్ ట్రాలీ ఆటో నడిపే వాడు.
ఇటీవల గుంటూరు ప్రాంతంలో పందిరి తోటలకు స్తంభాలు వేసే పనికి వెళ్తున్నాడు. తల్లిదండ్రులు కూడా కూలీనాలి చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొత్తగా నిర్మించుకున్న ఇంటి కోసం రూ.4 లక్షల మేర అప్పు చేశారు. ఈ అప్పు విషయంలో అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగేవి. గణేష్ ఇటీవలే దీపావళి పండుగ సందర్భంగా గుంటూరు నుంచి ఇంటికి వచ్చాడు. అయితే అప్పుల విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. అయితే తాను నడిపించే ట్రాలీ ఆటోకు చెందిన బ్యాటరీని అన్న ఎల్లం అమ్మేశాడని తెలిసి మరింత ఆగ్రహానికి గురయ్యాడు. అన్నను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి నర్సయ్య నాలుగు రోజుల క్రితమే భువనగిరి ప్రాంతంలో రాతి స్తంభాలు పాతేందుకు వెళ్లిపోయాడు. సోమవారం రాత్రి ఇంట్లోని కుడి పక్క గదిలో ఎల్లం నిద్రపోయాడు. హాల్‌లో తల్లి సుగుణమ్మ నిద్రపోయింది.
ఎడమ వైపు గదిలో గణేష్ నిద్రపోయినట్లు నటిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ గడిపాడు. తల్లి, అన్న గాఢ నిద్రలో ఉన్నట్లు గమనించి అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా గొడ్డలితో అన్న గదిలోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న ఎల్లం తలపై (చెవి భాగంలో) రెండు సార్లు కొట్టాడు. దీంతో రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ అతడు మరణించాడు. ఈ శబ్దానికి లేచిన తల్లి సుగుణమ్మ చిన్న కొడుకు గదిలో చూడగా అతను కన్పించకపోవడంతో పెద్ద కొడు కు గదిలోకి తొంగిచూసింది. అక్కడ రక్తపు మడుగులో పెద్దకొడుకు, పక్కనే ఉన్మాదిలా చిన్న కొడుకు కన్పించడంతో హత్య జరిగినట్లు గుర్తిం చి గుండెలవిసేలా విలపించింది. ఈ అరుపులు, ఏడుపులతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని నిందితుడు పారిపోకుండా జాగ్రత్త వ హించారు.
అదే రాత్రి గౌరారం పోలీసులకు సమాచారమందించి నిందితుడిని అప్పగించారు. సోమవారం రాత్రి గౌరారం ఎస్సై మధుసూదన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలిం చి వివరాలు సేకరించారు. మంగళవారం ఉదయం గజ్వేల్ ఇన్‌చార్జ్ సీఐ వెంకటయ్య ఘటన స్థలంలో మృతదేహన్ని పరిశీలించారు. మృతుని తల్లి సుగుణమ్మ నుంచి వివరాలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అప్పుల విషయంలో అన్నదమ్ములైన ఎల్లం, గణేష్‌ల మధ్య వైషమ్యాలు పెరిగాయని, ఈ నేపథ్యంలోనే ఉన్మాదిగా మారిన తమ్ముడు అన్నను గొడ్డలితో కిరాతకంగా హతమార్చాడని సీఐ పేర్కొన్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వివరించా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.
బోరుమన్న తల్లి
చేతికందిన ఇద్దరు అన్నదమ్ములు తమ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారనుకుంటే శత్రువుల్లా మారి ప్రాణాల మీద కు తెచ్చుకున్నారని తల్లి రోదించింది. ఒకరు చనిపోయి, మరొకరు జైలుకు వెళితే తమకు దిక్కెవరంటూ శోకసంద్రంలో మునిగిపోయింది. కొడుకు హత్య సమాచారం తెలిసిన తిరిగొచ్చి తండ్రి గుండెలవిసేలా విలపించాడు.