వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని పదేళ్లుగా.. | YS Jagan Fan Anil Kumar To Wear Footwear After Ten Years | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని పదేళ్లుగా..

Published Thu, May 30 2019 11:39 AM | Last Updated on Thu, May 30 2019 11:42 AM

YS Jagan Fan Anil Kumar To Wear Footwear After Ten Years - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌రూరల్ ‌: వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అతను వీరాభిమాని..ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు. అంతవరకు పాదరక్షలు ధరించనని ప్రతిన బూనాడు..ఆయనే ఆదిలాబాద్‌కు చెందిన బెజ్జంకి అనిల్‌కుమార్‌. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకా రం చేస్తున్న వేళ ఆయన వ్రతం వీడుతున్నారు.

వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని..
అనిల్‌కుమార్‌ 1991లో రాజకీయాల్లో రంగప్రవేశం చేశాడు. ఎన్‌ఎస్‌యూఐ స్కూల్‌ ప్రెసిడెంట్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1992లో ఆదిలాబాద్‌ పట్టణ కోశాధికారి వ్యవహరించారు. ఆ తర్వాత పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా కన్వీనర్‌గా 1996 వరకు పనిచేశారు. 2006లో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో సంతకాల సేకరణ మహోద్యమంలో పాల్గొన్నాడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దివంగతులైనప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు.. ఆమరణ దీక్షా చేపట్టాడు.. ఆదిలాబాద్‌ నుంచి బాసర పుణ్యక్షేత్రం వరకు సుమారు 160 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. అప్పుడే 2009 సెప్టెంబర్‌ 4న జగన్‌ సీఎం అయ్యేవరకు పాదరక్షలు ధరించనని ప్రతీన బూనారు. ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సుమారు పదేళ్ల తర్వాత ఆయన కల నేడు నెరవేరుతుంది. గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆయన తన దీక్షను విరమించనున్నారు. విజయవాడలో ఆ మహాకార్యం జరిగే వేదిక సమక్షంలోనే పాదరక్షలు ధరించి పదేళ్ల తన కఠోర దీక్ష ముగించనున్నారు.

ఆయన బిడ్డ ‘సాక్షి’..
తాను ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఘడియ రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వైఎస్‌ఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీరాభిమాని అయిన బెజ్జంకి అనిల్‌కుమార్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలుబడిన క్షణాన్ని ఆయన మరిచిపోలేకుండా ఉన్నారు. గతంలో వైఎస్సార్‌ జిల్లాకు వచ్చినప్పుడు ఆయన వెన్నంటే నిలిచారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆ తల్లి వెన్నంటే నిలిచాడు. అనిల్‌కుమార్‌ వైఎస్సార్‌ కుటుంబానికి ఎంత వీరాభిమాని అంటే.. ఆయన తమ్ముడు బెజ్జంకి సంతోష్‌కుమార్‌కు ‘సాక్షి’ పత్రిక ఆవిర్భావం రోజు కూతురు పుట్టడంతో ఆమెకు ‘సాక్షి’ అనే పేరు పెట్టి తన అభిమానం చాటుకున్నాడు. తన ఆకాంక్ష నెరవేరినందున పాదరక్షలు విజయవాడలో ధరించనున్నట్లు అనిల్‌కుమార్‌ ‘సాక్షి’తో తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement