హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేస్తున్న షర్మిల. చిత్రంలో ఆమె భర్త అనిల్, వైఎస్సార్‌సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఓ సినీ నటుడితో తనకు సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. తన బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నానని.. అటువంటి వ్యక్తిని తానెన్నడూ కలవలేదని, మాట్లాడలేదని స్పష్టం చేశారు. తనపై పదేపదే అవే పుకార్లు పుట్టిస్తూ ఎందుకింత పైశాచికత్వానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నవారితోపాటు చేయిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతూ షర్మిల తన భర్త అనిల్ కుమార్‌తో కలసి సోమవారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆమె వైఎస్సార్ సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. తనకు ఓ సినీ నటుడితో సంబంధాలున్నట్లు పుకార్లు పుట్టిస్తున్న వారు, అలా ప్రచారం చేయిస్తున్న వారు వాటిని రుజువు చేయగలరా? అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. మహిళల సమానత్వం, స్వేచ్ఛ కేవలం కాగితాలు, చర్చలకే పరిమితం కారాదని ఆచరణలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంకా ఏమన్నారంటే...
ఎన్నికలు రావడంతో మళ్లీ విష ప్రచారం..
‘2014 ఎన్నికలకు ముందు మొదలు పెట్టి ప్రభాస్ అనే ఒక మూవీ స్టార్‌కు నాకు సంబంధం ఉందనే దుష్ప్రచారాన్ని ఓ వర్గం ఆన్‌లైన్‌లో ఒక క్యాంపెయిన్‌లా నడిపింది. అప్పట్లో మేం ఫిర్యాదు కూడా చేశాం. విచారణ జరిపి పోలీసు యాక్షన్ తరువాత కొంత కాలం ఈ దుష్ప్రచారం ఆగింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కనుక మరోసారి ఈ విష ప్రచారం వేగం పెంచారు. వీళ్ల ఉద్దేశం ఒక్కటే... నా వ్యక్తిత్వాన్ని హననం చేయడం. ఈ దుష్ప్రచారాలను సృష్టిస్తున్న వారి మీద, వారి వెనుక ఉన్న వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరేందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చా.
స్త్రీలంటే ఇంత చులకన భావమా?
ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా భావించడం లేదు. ఇలాంటి రాతలు ఇంకెంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారు. స్త్రీల పట్ల శాడిజం, చులకన భావంతో రాస్తున్నారు. ఇలా రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని మన సమాజం ఆమోదించవచ్చా? ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమానత్వం, మహిళల స్వేచ్ఛ లాంటి గొప్ప పదాలు కాగితాలు, చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇవి వాస్తవ రూపం దాల్చాలంటే మనం గొంతెత్తాలి. వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న నా విజ్ఞప్తికి మద్దతు పలకాలని ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు, మహిళలు, రాజకీయ నాయకులను కోరుతున్నా. దుష్ప్రచారం చేస్తున్న వారు, చేయిస్తున్న వారికి బదులుగా ఈరోజు ఇలా దోషిలా నిలబడి నా వాదనను వినిపించుకోవాల్సిన దుస్థితి రావడం ఒక్క నాకే కాదు మహిళలందరికీ ఇది అవమానకరం. ఐదేళ్ల కిందట మొదలైంది ఇప్పుడు మళ్లీ తలెత్తింది. మళ్లీ మళ్లీ కూడా తలెత్తవచ్చు. నేను మాట్లాడక పోతే అది నిజమేమో అని కొంతమందైనా అనుకునే ప్రమాదం ఉంది కనుక ఈ తప్పుడు ప్రచారాలను మూలాలతో సహా తొలగించాలని పోలీసులను కోరేందుకు వచ్చా.
నాలా ప్రమాణం చేసి చెప్పగలరా?
ఓ భార్యగా, తల్లిగా, చెల్లిగా నా నైతికత, నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి నాకు తెలుసు. ఆ దేవుడికీ నా గురించి తెలుసు. కానీ ఈరోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక మీ అందరి ముందుకొచ్చి చెబుతున్నా. ఏ వ్యక్తితో నాకు సంబంధం ఉందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో.. ఆ వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదు. ఒక్కసారి కూడా మాట్లాడ లేదు. ఆ వ్యక్తికీ, నాకు ఏ సంబంధమూ లేదు. ఎప్పుడూ ఏ సంబంధమూ లేదు. ఇది నిజం. ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నా. దుష్ప్రచారాలు చేస్తున్నవారు, చేయిస్తున్న వారు నాలా ప్రమాణం చేసి నిజం చెప్పగలరా? నాకు ఫలానా వ్యక్తితో సంబంధం ఉందని కానీ, నేనెప్పుడైనా కలిశానని గానీ, మాట్లాడానని గానీ రుజువులు, ఆధారాలు చూపగలరా? పుకార్లు పుట్టించి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణం, దుర్మార్గం కాదా?
ఇది టీడీపీకి కొత్తేం కాదు
ఇలా నాపై బురద చల్లే ప్రచారాల వెనుక టీడీపీ హస్తముందని నేను ఎలాంటి అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నా. అందుకు కారణం లేక పోలేదు. టీడీపీకి పుకార్లు పుట్టించడం కొత్తేమీ కాదు. మా నాన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఫ్యాక్షనిస్టు అంటూ పుకార్లు పుట్టించింది ఈ టీడీపీనే. మా నాన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనది ఎంత గొప్ప మనసో, ఎంత పెద్ద మనసో, ఎంత గొప్ప వ్యక్తిత్వమో లోకమంతా చూసింది.
చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా?
సీఎం చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా? మేం కూడా ఇలాంటి పుకార్లు పుట్టించాలి అనుకుంటే పుట్టించలేమా! మాకు ఆ తెలివి లేకా కాదు, మాకు చేతకాకా కాదు. నామీద టీడీపీ నాయకులు అసహ్యంగా మాట్లాడినప్పటికీ మేం తిరిగి అలాంటి చర్యలకు దిగలేదంటే కారణం.. మాకు విలువలున్నాయి కనుకనే. మా అన్నకు నైతికత, మంచితనం ఉంది కనుకనే. మా నాన్న వైఎస్సార్ మాకు ధర్మంగానే పోరాటానికి ధైర్యమిచ్చాడు కనుకనే. అసలు చంద్రబాబు డిక్షనరీలో విలువలు, నైతికత అనే పదాలే లేవు. ఓ నాయకుడు మంచివాడైతే అతడిని అనుసరించే వారు కూడా సన్మార్గంలోనూ నడుస్తారు. సొంత మామ దగ్గరి నుంచి కుర్చీ లాక్కున్నప్పటి నుంచీ చంద్రబాబువి ఎప్పుడూ మోసపూరితమైన ఆలోచనలే. ఇలాంటి నాయకులు అధికారంలో ఉన్నంత వరకూ సమాజం బాగు పడదు.
ఇలాగే నీచమైన రాజకీయాలు చేస్తూ పోతే, ఇంతగా దిగజార్చుతూ పోతే వాళ్లెక్కడా కనిపించరని గుర్తుంచుకోవాలి. ఈ రాతలు రాస్తున్న వారు, రాయిస్తున్న వాళ్లు దేవుడున్నాడని గుర్తు పెట్టుకోవాలి. పాపం ఊరికే పోదు. ఇది నా ఒక్కరి వ్యక్తిగత విషయంగా పరిగణించకుండా మహిళలందరి గౌరవం, మర్యాదకు సంబంధించిన విషయంగా భావించి దోషులను శిక్షించాలని పోలీస్ అధికారులను కోరాం. చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.’అని పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారం వెనుక కచ్చితంగా టీడీపీ ప్రమేయం ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా షర్మిల పేర్కొన్నారు. మీరు ఏపీలో ఫిర్యాదు చేయకుండా హైదరాబాద్‌లో ఎందుకు ఫిర్యాదు చేశారు? అక్కడి పోలీసులపై నమ్మకం లేకనా? లేక మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టా? అని మీడియా ప్రశ్నించగా ‘మాకు నమ్మకం లేదు’అని క్లుప్తంగా సమాధానమిచ్చారు.
చంద్రబాబు ఎందుకు ఖండించరు?
మా జగనన్న గర్విష్టి, కోపిష్టి, అహంభావం ఉన్నవారని పుకార్లు పుట్టించింది కూడా తెలుగుదేశం పార్టీయే. కానీ ఆయన ఎంత సౌమ్యుడో పాదయాత్రలో కోట్ల మంది ప్రజలకు అర్థం అయింది. ఇప్పుడు నామీద పుకార్లు పుట్టిస్తున్నది కూడా టీడీపీనే. ఒకవేళ టీడీపీ ప్రమేయం లేకుంటే ఆ పార్టీ వాళ్లు మాట్లాడుతున్నపుడు అలాంటి మాటలను ఎందుకు ఖండించడం లేదు? ‘ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడటం తప్పు..’అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు ఆపలేదు? ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పైనా సరే దాన్నే నిజంలా చూపించాలన్నది టీడీపీ సిద్ధాంతం కాదా? స్వయంగా చంద్రబాబు గారే వీటిని ప్రోత్సహిస్తారు. అందుకే వాళ్ల నాయకులు దానిని అనుసరిస్తారు. ఇదీ వాస్తవం! తెలుగువారి ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే పార్టీలకు చెందిన వారు అసలు రాష్ట్రంలోని మహిళలకు ఆత్మగౌరవం ఉండాలో, లేదో చెప్పండి. కుటుంబ గౌరవం అన్నది ఉందో లేదో చెప్పండి. మీ పార్టీలో ఉన్న మహిళలకు, మీ కుటుంబాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందని మీరు భావిస్తున్నారా? రాజకీయాలను ఇంతగా దిగజార్చకండి.
ఆ ప్రయత్నాలను సాగనివ్వం: సజ్జల
రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్షానికి చెందిన వారిపై విష ప్రచారం చేయడం, పుకార్లు పుట్టించడం చంద్రబాబు, టీడీపీ నేతల డీఎన్‌ఏలో అంతర్భాగమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ విలువలు, విశ్వసనీయతకు మారుపేరు కాగా దుష్ప్ర చారం చేయడం అనేది టీడీపీలో అంతర్భాగమని విమర్శించారు. షర్మిలపై పుకార్లు పుట్టించి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సాగనివ్వబోమని హెచ్చరించారు. ఇది షర్మిల ఒక్కరిపైనే జరుగుతున్న దాడి కాదని మహిళా లోకం ఆత్మ గౌరవాన్ని కించపర్చడమేనన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి లాంటి వారు పలు వేదికలపై జగన్, షర్మిలను ఉద్దేశించి దుర్భాషలాడుతూ ఉంటే సీఎం చంద్రబాబు నవ్వుతూ ప్రోత్సహించారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. జనాదరణ కలిగిన నేతలపై పుకార్లు పుట్టించడం చంద్రబాబుకు ఆనవాయితీ అని విమర్శించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక.. సీసీఎస్‌లో కేసు నమోదుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మహిళలను వేధింపులకు గురిచేస్తే ఎంతవారినైనా వదిలే ప్రసక్తేలేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. షర్మిల ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ఆయన దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఫిర్యాదును నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లోని సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేస్తూ వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దుష్ప్రచారం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు? ఎక్కడి నుంచి సోషల్ మీడియాలో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారో గుర్తించి అరెస్ట్ చేయాలని అదేశించారు.
రంగంలోకి ప్రత్యేక బృందం...
షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 2000 (ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా అసత్యాలను ప్రచారం చేయడం), ఐపీసీ సెక్షన్ 509 (మహిళలను కించపరచడం) కింద కేసు (19/2019) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సైబర్ క్రైమ్ విభాగం అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. షర్మిల ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని సంబంధిత సోషల్ మీడియా ఖాతాలకు చెందిన ఐపీ అడ్రసులను గుర్తించేందుకు గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇతర సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు. ఐపీ చిరునామా ఆధారంగా నిందితులను వెలికి తీస్తామని, రెండు మూడు రోజుల్లోనే ట్రోల్స్ చేస్తున్న వారి వివరాలు వెలుగులోకి వస్తాయని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment