Chandrababu And TDP Cheap Politics Vidadala Rajini Photos Morphing - Sakshi
Sakshi News home page

చంద్రబాబు దర్శకత్వంలో..టీడీపీ సమర్పిస్తున్న.. ది డర్టీ పిక్చర్‌..! 

Published Fri, Aug 19 2022 3:08 AM | Last Updated on Fri, Aug 19 2022 9:56 AM

Chandrababu And TDP Cheap Politics Vidadala Rajini Photos Morphing - Sakshi

వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డిని మంత్రి రజని మర్యాదపూర్వకంగా కలిసిన ఫొటోను.. టీడీపీ నేత బాలకృష్ణ తలతో మార్ఫింగ్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ

సాక్షి, అమరావతి: అధికారంతో పాటు జనాదరణకు కూడా దూరమవుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిలో నిరాశా నిస్పృహలు పతాక స్థాయికి చేరుతున్నాయి. చివరకు మంత్రులపై పార్టీ మారుతున్నారనే దుష్ప్రచారం చేయటానికి ఫొటోలు మార్ఫింగ్‌ చేయటానికి దిగటంతో పాటు.. ఎంపీల ప్రతిష్టను దిగజార్చడానికి బూతు వీడియోల స్థాయికి దిగజారిపోయారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఫొటోను తీసుకుని... టీడీపీ సోషల్‌ మీడియా శ్రేణులు సాయిరెడ్డి తలకు బాలకృష్ణ తలను అతికించి దుష్ప్రచారానికి దిగారు. మంత్రి రజని పార్టీ మారుతున్నారంటూ... జగన్‌కు షాక్‌ ఇస్తున్నారని వీడియోలు సృష్టించి వైరల్‌ చేశారు.

ఇక అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ పేరిట ఇటీవల సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ ‘బూతు వీడియో కాల్‌’కు కర్త, కర్మ, క్రియ అన్నీ తెలుగుదేశం పార్టీయేనని.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పై బురద జల్లటానికి ఆఖరికి అమెరికాకు చెందిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను కూడా తప్పుదోవ పట్టించారని ఆ సంస్థే స్వయంగా వెల్లడించింది. ఆ బూతు వీడియో కాల్‌ను ఒరిజినల్‌ మాదిరిగా మార్ఫింగ్‌ చేయడానికి చంద్రబాబు నాయుడి టీమ్‌ ఎంతగా కృషి చేసిందో సదరు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అధిపతి జిమ్‌ స్టాఫర్డ్‌ స్వయంగా వివరిస్తూ ఏపీ సీఐడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. లేఖలోని వివరాల ప్రకారం టీడీపీ నేతలు ఈ బూతు చిత్రాన్ని ఎలా సమర్పించారంటే... 
.. 
మొదటో ఓ వీడియోను తీసుకున్నారు. చంద్రబాబు నాయుడి దర్శకనిర్మాణంలో దాన్ని ఎడిట్‌ చేసి, మార్ఫింగ్‌ చేసి... అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను దెబ్బతీసేలా... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లటానికి పనికివచ్చేలా తమకు కావలసినట్లు మార్చుకున్నారు. దీన్ని ఒక ఫోన్‌లో ప్లే చేస్తూ... ఆ ఫోన్లో ప్లే అవుతున్న వీడియోను మరో ఫోన్‌ ద్వారా ఎలాంటి అంతరాయాలూ లేకుండా షూట్‌ చేశారు. ఎందుకంటే అలా షూట్‌ చేసినపుడు అందులో మధ్యలో ఆగటం, ఎడిట్‌ చేసినట్లు కనిపించటం వంటివేమీ ఉండవు. ఇదిగో... ఇలా షూట్‌ చేసిన వీడియోను తమ పార్టీకి చెందిన ప్రసాద్‌ పోతిని అనే వ్యక్తి ద్వారా అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.

ఆ ల్యాబ్‌.. తనకు పంపిన వీడియోను చూసింది. ‘‘మేం చూసిన వీడియో ఒరిజినలే. కాకపోతే దాన్ని ఒక ఫోన్లో ప్లే చేస్తుండగా మరో ఫోన్‌ కెమెరా ద్వారా షూట్‌ చేశారు. అలా షూట్‌ చేసిందే మాకు పంపించారు. మా చేతికి ఏదైతే ఒచ్చిందో అందులో ఎలాంటి ఎడిటింగ్‌ జరగలేదు’’ అని తమ నివేదికలో జిమ్‌ స్టాఫర్డ్‌ స్పష్టంగా పేర్కొన్నారు. అయితే తమకు అందిన దాని గురించే తాము చెప్పామని... తమకు ఒరిజినల్‌ వీడియో పంపించినట్లు తాము చెప్పలేదని, మార్ఫింగ్‌ చేసి... ఎడిట్‌ చేసిన వీడియోను ఒక ఫోన్లో ప్లే చేస్తూ... దాన్ని వేరే ఫోన్‌తో షూట్‌ చేసి ఉండొచ్చని స్టాఫర్డ్‌ స్పష్టంగా చెప్పారు కూడా. నిజానికి అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చెప్పింది కూడా ఇదే. వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ కాదని!!.  

 టీడీపీ ప్రచారం చేసిన ఫోరెన్సిక్‌ సర్టిఫికెట్‌ తామివ్వలేదని ఎక్లిప్స్‌ ల్యాబ్‌ పంపిన మెయిల్‌   

మెయిల్‌ను మార్చమని అడిగిన టీడీపీ... 
నిజానికి ఎక్లిప్స్‌ ఫోరెన్సికల్‌ ల్యాబ్‌ చెప్పినదాంట్లో టీడీపీకి అనుకూలమేమీ లేదు. దీంతో ల్యాబ్‌ హెడ్‌ జిమ్‌ స్టాఫర్డ్‌ను ప్రసాద్‌ పోతిని సంప్రతించారు. తమకు పంపిన మెయిల్‌ను కాస్త మార్చాలని అడిగారు. దానికి స్టాఫర్డ్‌ వెంటనే సమాధానమివ్వలేదు. ఈలోగా చంద్రబాబు నాయుడి టీమ్‌ ఆ పని చేసేసింది. మెయిల్‌ను ట్యాంపర్‌ చేసేసింది. జిమ్‌ స్టాఫర్డ్‌ ఇచ్చిన నివేదికలో కొన్ని పదాలను తొలగించేసి... అది ఒరిజినల్‌ వీడియో అంటూ అమెరికన్‌ ల్యాబ్‌ ధ్రువీకరించిందని, ఇంకా ఏం సాక్ష్యాలు కావాలంటూ యావత్తు తెలుగుదేశం బృందం ఎక్కడికక్కడ మీడియా ముఖంగా ఆక్రందనలు మొదలెట్టింది. షరా మామూలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 తదితర బాబు బాకా మీడియా సంస్థలు దీన్ని బ్రహ్మాండం బద్దలైపోయినట్లుగా... ‘‘అమెరికా సంస్థే తేల్చింది’’ అంటూ పతాక శీర్షికల్లో వండి వార్చేశాయి.  

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నిజాన్ని ఎన్నాళ్లు దాచగలరు? అందుకే ఈ వ్యవహారంలో మీరేం చెప్పారు? అది ఒరిజినల్‌ వీడియో అని చెప్పారా? అని అడిగిన సీఐడీకి... ఎక్లిప్స్‌ ల్యాబొరేటరీస్‌ లేఖ పంపింది. అందులోని నిర్ఘాంతపోయే నిజాలతో... తెలుగుదేశం పార్టీ నిర్మించి సమర్పించిన డర్టీ పిక్చర్‌ వ్యవహారం బయటపడింది. అంతే కాదు!! తమ నివేదికను ట్యాంపర్‌ చేసిన ప్రసాద్‌ పోతినిపైన, ఆ నివేదికను ప్రచారంలోకి తీసుకువచ్చిన వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని జిమ్‌ స్టాఫర్డ్‌ చెప్పటం... ఈ వ్యవహారంలో చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని చెప్పాలి.  

ఇదండీ... జరిగిన కథ 
► ఓ పురుషుడు, ఓ మహిళ సంభాషణకు సంబంధించిన వీడియో కాల్‌ ఒక ఫోన్లో ప్లే అవుతుండగా... దాన్ని మరో వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా రికార్డ్‌ చేశారు. ఆ వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్‌ అనే అభియోగాలు మోపారు. కానీ తాను ఆ వీడియోలో ఉన్నట్టుగా కొందరు మార్ఫింగ్‌ చేశారని ఎంపీ మాధవ్‌ చెప్పారు.  
► మీడియాలో ప్రసారమైన ఆ వీడియోను ప్రసాద్‌ పోతిని అనే వ్యక్తి అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి.. ఆ వీడియో ఒరిజినలే అని ఆ ల్యాబ్‌కు చెందిన జిమ్‌ స్టాఫర్డ్‌ ధ్రువీకరించినట్టుగా ఓ సర్టిఫికెట్‌ను మరికొందరితో కలసి మీడియాలో వైరల్‌ చేశారు.  
► ఈ అంశంపై అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను సీఐడీ విభాగం సంప్రదించగా.. జిమ్‌ స్టాఫర్డ్‌ స్పందిస్తూ... ఆ వీడియో ఒరిజినల్‌ అని తాము ధ్రువీకరించలేదన్నారు. తమకు పంపిన వీడియో క్లిప్‌ను మాత్రమే ఒరిజినల్‌ అన్నామని, దానికి మాతృక అయిన వీడియోను తాము ధ్రువీకరించలేదని... ఈ మేరకు ఎలాంటి నివేదికా ఇవ్వలేదని స్పష్టంగా చెప్పారు. ఆ అసలైన వీడియో క్లిప్‌ పంపితేనే అది ఒరిజినలో కాదో చెప్పగలమని కూడా ఆ సంస్థ ప్రసాద్‌ పోతినికి స్పష్టం చేసింది.  

ట్యాంపర్‌ నివేదికతో దుష్ప్రచారం  
► ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ఇచ్చిన నివేదికతో ప్రసాద్‌ పోతిని సంతృప్తి చెందలేదు. తాము ఆశించినట్టుగా ఆ వీడియో ఒరిజినలే అని నివేదిక ఇవ్వాలని జిమ్‌ స్టాఫర్డ్‌ను కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించ లేదు. దీంతో ఎక్లిప్స్‌ ల్యాబ్‌ ఇచ్చిన నివేదికను ప్రసాద్‌ పోతిని ట్యాంపర్‌ చేశారు. అలా మార్చిన నివేదికను ఆయనతోపాటు కొందరు మీడియాలో వైరల్‌ చేశారు. అయితే ఆ సర్టిఫికెట్‌ తాము జారీ చేసింది కాదని జిమ్‌ స్టాఫర్డ్‌ నేరుగా ఏపీ సీఐడీకి మెయిల్‌ ద్వారా తెలియజేశారు. 
► వైఎస్సార్‌ సీపీపై దుష్ప్రచారానికి ఇలా తప్పుడు నివేదికను ప్రచారంలోకి తేవటంపై సీఐడీ అధికారి సునీల్‌ కుమార్‌ స్పందిస్తూ... ‘‘ఏదైనా సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్‌ను యథాతథంగా వెల్లడించాలి. అంతేగానీ అందులో మార్పులు చేయడం చట్ట ప్రకారం నేరం. అందుకు బాధ్యులైన వారిపై ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అన్నారు. 



ఆర్‌ఆర్‌ఆర్‌లోని సీన్‌ను రికార్డు చేస్తే... 
ఓ చిన్న ఉదాహరణ చూస్తే పై సంఘటనకు అతికినట్లు సరిపోతుంది.  
► ఇటీవల వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఓ సీన్‌లో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఓ వ్యాన్‌ నుంచి దూకినట్టుగా చూపిస్తారు. అవి నిజమైన పులులు, సింహాలు కావు. గ్రాఫిక్స్‌ ద్వారా నిజమేననే భ్రమ కలిగించేలా చేశారు. ఆ సినిమాను థియేటర్‌లో ప్రదర్శిస్తుంటే ఎవరైనా నిజమే అనుకుంటారు. మరి అలా తెరపై ప్లే అవుతున్న సినిమాను తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేసి... ఆ వీడియోను వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారనుకోండి. ఆ సీన్‌లో ఉన్నవి నిజమైన పులులు, సింహాలో కాదో చెప్పమన్నారనుకోండి.  ఆ ల్యాబ్‌ ఏం చేస్తుంది? 
► ఆ మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేసిన క్లిప్‌ (తమకు వచ్చినది) మాత్రమే ఒరిజినల్‌ అని ఏ ల్యాబైనా చెబుతుంది. సినిమా థియేటర్లో తెరపైన ప్రదర్శించిన సీన్‌లో ఉన్న పులులు, సింహాలు నిజమైనవో కావో ఆ వీడియోను చూసి ఏ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా చెప్పలేదు. అలా చెప్పాలంటే ఆ సినిమా డిజిటల్‌ రీల్‌ను ఫోరెన్సిక్‌ సంస్థకు పంపించాలి. ప్రస్తుతం ఎంపీ మాధవ్‌ పేరుతో కొందరు వైరల్‌ చేసిన వీడియో క్లిప్‌ కూడా అలాంటిదే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement