సాక్షి, హైదరాబాద్ : సోషల్‌మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం షర్మిల, భర్త అనిల్ కుమార్‌తో కలిసి కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. వీరితో పాటూ కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.
వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. '2014 ఎన్నికలకు ముందు ఎప్పుడో మొదలు పెట్టి, నాకు సినీ హీరో ప్రభాస్‌కు సంబంధం ఉంది అని ఓ వర్గం ఆన్‌లైన్‌లో దుష్ప్రచారాన్ని చేసింది. ఎన్నికల తరువాత దీనిపై ఫిర్యాదు కూడా చేశాము. పోలీసుల విచారణ అనంతరం, చర్యలు తీసుకోవడంతో కొంత కాలం ఈ దుష్ప్రచారం ఆగింది. కానీ మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి, కనుక ఈ విషప్రచారానికి మళ్లీ వేగం పెంచారు. వీరి ఉద్దేశం ఒక్కటే నా వ్యక్తిత్వాన్ని హననం చేయడం. ఈ ప్రచారాలను సృష్టిస్తున్నవారిమీద, వారి వెనకున్న వారి మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కలిశాము. ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా భావించడం లేదు. ఇలాంటి రాతలు ఇంకా ఎంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారు. స్త్రీల పట్ల ఇంత పైశాచికంగా, ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని, మన సమాజం ఆమోదించవచ్చా ?
ప్రజాస్వామ్యం మానవ హక్కులు, సమానత్వంలాంటి ఎన్నో గొప్ప గొప్ప పదాలు కాగితాలు, చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇవి వాస్తవ రూపం దాల్చాలంటే మనం గొంతు ఎత్తాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో ఈ ప్రచారాలకు వీలే లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదుకు ప్రజాస్వామ్య వాదులు, నైతికత ఉన్న రాజకీయనాయకులు, జర్నలిస్టులు, మహిళలు మద్దతు పలుకవల్సిందిగా కోరుతున్నాము. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారు, తప్పుడు ప్రచారాలు చేపిస్తున్న వారు కాకుండా, నేను ఒక దోషిలా నిలబడి నా వాదనలు వినింపించుకోవాల్సిన దుస్థితి రావడం నాకే కాదు, మహిళలందరికి ఇది అవమానకరం. ఇది ఐదేళ్ల కింద ఎప్పుడో మొదలైంది. ఇప్పుడు మళ్లీ తలెత్తింది. మళ్లీ మళ్లీకూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మాట్లాడకపోతే ఇదే నిజం అని కొంతమంది అయినా అనుకునే అవకాశం ఉంది. ఈ తప్పుడు ప్రచారాలను మూలాలతో సహా తొలగించాలనే ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశాము.
నేను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా నా నైతికతను, నా నిజాయితీని నిరూపించుకోవాల్సి పనిలేదు. నా గురించి నాకు తెలుసు. కానీ, ఈ రోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకు ఉంది, కాబట్టి మీ అందరి ముందుకు వచ్చి చెబుతున్నా. ఏ హీరోతో అయితే సంబంధం ఉందని తప్పడు ప్రచారం చేస్తున్నారో, ఆ వ్యక్తిని నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలవలేదు, మాట్లాడలేదు. ఇదే నిజమని నాపిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. తప్పడు ప్రచారాలు చేస్తున్న వారు మీరు ప్రచారం చేస్తున్నదే నిజం అని, నాలా ప్రమాణం చేయగలరా. లేదా రుజువులు, ఆధారాలు చూపించగలరా? పుకార్లు పుట్టించి వ్యక్తిత్వాన్ని కించపరచడం దారుణం, దుర్మార్గం కాదా. నన్ను ప్రేమించే నా భర్త ఉన్నాడు. నా మీద ఆధారపడ్డ నా పిల్లలున్నారు. కుటుంబ సభ్యులు, మిత్రులు అందరిని బాధపెట్టే విషయం ఇది. ఇలా పుకార్లు పుట్టించిన వారికి, వారి వెనక ఉన్న వారికి సిగ్గనిపించడం లేదా?
ఈ ప్రచారాల వెనుక టీడీపీ ఉందని భావిస్తున్నా. టీడీపీకి పుకార్లు పుట్టించడం కొత్త ఏమీ కాదు. మా నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్యాక్షనిస్టు అంటూ పుకార్లు పుట్టించింది టీడీపీ పార్టీ. తర్వాత వైఎస్సార్ సీఎం అయ్యాక ఆయనదెంత గొప్ప మనసో, ఎంత గొప్ప వ్యక్తిత్వమో లోకం అంతా చూసింది. మా అన్న వైఎస్ జగన్ కోపిష్టి, గర్విష్టి అని టీడీపీ పుకార్లు పుట్టించింది. కానీ ఆయన ఎంత సౌమ్యుడో ఈ పాదయాత్రతో కోట్ల ప్రజలకు అర్థం అయింది. ఇప్పుడు నా మీద కూడా పుకార్లు పుట్టిస్తుంది టీడీపీనే. ఎందుకంటే ఎంతమంది టీడీపీ నాయకులు నాకు అతనితో సంబంధం ఉందని మాట్లాడలేదు? ఒక వేళ టీడీపీకి ఈ పుకార్లతో సంబంధంలేకపోతే. ఆ పార్టీ వాళ్లు మాట్లాడతున్నప్పుడు ఆ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు. ఒక అమ్మాయి మీద అలా మాట్లాడటం తప్పు అని ఎందుకు ఆపలేదు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పయినా సరే దాన్నే నిజంలా చూపించాలన్నది టీడీపీ సిద్దాంతం కాదా. స్వయంగా చంద్రబాబు వీటిని ప్రోత్సహిస్తారు. అందుకే వాటిని టీడీపీ నాయకులు అనుసరిస్తారు.
తెలుగువారి ఆత్మ గౌరవం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే పార్టీల వాళ్లు, అసలు మహిళలకు ఆత్మగౌరవం ఉండాలో లేదో చెప్పండి. లేక పోతే మీ పార్టీలోని మహిళలు, మీ కుటుంబంలోని మహిళలకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందని భావిస్తున్నారో అది కూడా చెప్పండి. రాజకీయాలను ఇంతలా దిగజార్చకండి. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా. అలాంటి పుకార్లు మేము పుట్టించలేమా. మాకు విలువలున్నాయి, నైతికత, మంచితనం ఉంది. మా నాన్న ధర్మంగానే పోరాడటానికి ధైర్యం ఇచ్చారు. అసలు చంద్రబాబు డిక‌్షనరీలో విలువలు, నీతి అనే పదాలే లేవు. ఒక నాయకుడు మంచి వాడైతే, అనుచరులు అనుసరిస్తారు. ఇలాంటి నాయకులు అధికారంలో ఉన్నంత వరకు సమాజం బాగుపడదు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తూ పోతే, వాళ్లు ఎక్కడా కనిపించరు. దేవుడున్నాడని గుర్తుపెట్టుకోవాలి. కమిషనర్‌ను కలిసి మాట్లాడినప్పుడు నా వ్యక్తిగత విషయంగా కాకుండా మహిళలందరి ఆత్మగౌరవ విషయంగా పరిగణించి, దోషులను శిక్షించాలని కోరాము' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment