
సినీ నటుడు శరత్‌కుమార్ నుంచి పురస్కారం అందుకున్న చిన్నారి సంఘ సేవకురాలు కలశ మేడపురెడ్డి
విశాఖ కల్చరల్: ప్రతిభతో.. సేవా దృక్పథంతో.. రాణిస్తున్న మహిళలను సత్కరించారు.. సమాజానికి దశ దిశ నిర్దేశించల మార్గ దర్శకులైన అతివలకు జేజేలు పలికారు.. పురస్కార గ్రహీతల్లో విజయనిర్మల వం టి దర్శక దిగ్గజం నుంచి కలశ మేడపురెడ్డి వంటి నాలుగేళ్ల చిన్నారి వరకు విభిన్న రంగాల వారు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ టూరిజం సంస్థ, జె–వరల్డ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వి–టీఎం ఈవెంట్ మేనేజర్ సంస్థ సీఈఓ వీరూమామ నిర్వహించారు. గిన్నిస్‌బుక్ రికా ర్డుల్లోకెక్కిన సీనియర్ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మలకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల రాలేక పోవడంతో ఆమె తనయుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రధాన కార్యదర్శి నరేష్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైజాగ్ తనకు తల్లిలాంటిదని నరేష్ అన్నారు. ప్రతి మనిషి జీవితంలో రెండుసార్లు పుడతాడు.
అమ్మ కడుపులోంచి ఒకసారి, ఎక్కడైతే వృత్తి ప్రారంభమైందో అక్కడ మరోసారి పుడతాడు. ఈ విధంగా వైజాగ్ తన కు తల్లితో సమానమని వివరించారు. తన గురువు జంధ్యాల దర్శకత్వంలో సినీ కెరీర్ నాలుగు స్తంభాలాటతో ప్రారంభమైందన్నారు. విశాఖలోనే తాను నటించిన జంబలకడి పంబ వంటి పలు చిత్రాల షూటింగ్ జరిగి అద్భుత విజయాలు సాధించాయన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, దక్షిణాది సూపర్‌స్టార్ శరత్‌కుమార్, సినీ దర్శకురాలు బి.జయ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరేష్, ఏపీ పర్యాటక సంస్థ డైరెక్టర్ పి.ఎస్.నాయుడు, టాలీవుడ్ నిర్మాత బి.ఎ.రాజు, వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్ అధక్షుడు గంట్ల శ్రీనుబాబు, గంటా నారాయణమ్మ ట్రస్ట్ చైర్‌పర్సన్ గంటా శారద, సురక్ష హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ నటి శ్రీదేవి, సిరియా అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వసంత కోకిల చిత్రంలో ఇళయారాజా స్వరపరిచిన ‘కథగా కల్పనగా..’ పాటను శ్రీదేవి స్మృతిగా ఆలపించారు. సందర్భానికి సరితూగేలా యుగే..యుగే.. నా ధర్మము.. అనే పల్లవితో సాగిన గీతం మహిళల మనోభావాలను ఆవిష్కరించింది. నృత్య ప్రదర్శనల మధ్యలో క్విజ్, దివ్యాంగులు/ ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారి సాంస్కృతిక ప్రదర్శనలు వెరసి కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగారూ రూపొందించారు.
పురస్కార గ్రహీతలు వీరే..
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి వి–టీమ్ అంతర్జాతీయ మహిళా పురస్కారాలు స్వీకరించారు. వీరిలో పద్మినీ కచ్చపి (సంగీతం–అమెరికా), నజరత్ హజాన్ (దుబాయ్–శాంతి), హరిక కొలివెలసి (ఏపీ–సంఘ సేవ), బి.జయ (టాలీవుడ్ దర్శకురాలు), కల్పన (సినీ నేపధ్యగాయని), పల్లవి(బుల్లితెర నటి), కలశ మేడపురెడ్డి (చిన్నారి సంఘ సేవకురాలు), శరణి గంటా (నారాయణ గ్రూప్ విద్యాసంస్థల డైరెక్టర్), సీతా మాడభూషి (సంప్రదాయ నాట్యం), సనా(టాలీవుడ్ క్యారెక్టర్ నటి), మార్టినా డి–క్రూజ (అడ్వాన్స్ ఎడ్యుకేషన్), జి.లక్ష్మి (పోలీసు), సమలినీ ఫోనిక్సా(శ్రీలంక నటి) ఈ పురస్కారాలందుకున్నారు. కార్యక్రమానికి సౌత్ ఇండియా టైటిల్ విజేత గాయత్రి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment