ప్రసన్నకుమార్ మహంతి
ఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి ఈరోజు ఇక్కడ రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన 15 శాఖల అధికారులతో సమావేశమయ్యారు. విభజనకు ఎంత సమయం పడుతుందన్న అంశంపై మహంతి నివేదికలను హొం శాఖ అధికారులకు అందజేశారు. కేంద్ర హొం శాఖ అధికారులు నిర్వహించిన ఈ సమావేశంలో విభజన ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
అధికారుల విధులపై చర్చించారు.
విభజన ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నుంచి 12 నెలలు సమయం పట్టే అవకాశం ఉందని సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే విభజనపై మరింత దృష్టిపెట్టలేమని అధికారులు చెప్పారు. త్వరలో మరోసారి సమావేశమవ్వాలని అధికారులు నిర్ణయించారు.
రెండు రాష్ట్రాలు అధికారికంగా విడిపోయే రోజు(నిర్ణీతరోజు- అపాయింటెడ్ డే) ఏ రోజన్నది ఇంకా నిర్ణయించవలసి ఉంటుంది. అది రాజకీయ నిర్ణయం. ఆ తేదీ ఎప్పుడనేది ప్రభుత్వం ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై రేపటిలోగా కేంద్ర హోంశాఖ ఓ నిర్ధారణకు రానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, అంతకు ముందు మహంతి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శితో సమావేశమై ఆలిండియా సర్వీస్, రాష్ట్ర సర్వీస్ ఉద్యోగులవిభజనపై చర్చించారు.