
ఢిల్లీలో తొలి మూడు గంటల్లో 17% పోలింగ్
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి షీలా దీక్షిత్.. ఇలా అనేకమంది ప్రముఖులు ఢిల్లీ ఎన్నికలలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో తొలి మూడు గంటల్లోనే దాదాపు 17% పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల దారిలోనే ఇక్కడ కూడా అత్యధిక పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నారు. అలాగే, ఇంతవరకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్, అలాగే ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి విజయ్ దేవ్ తదితరులు ముందుగానే ఓట్లు వేశారు.
ఈసారి కూడా తాము గెలిచి తీరుతామన్న ధీమాను ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వ్యక్తం చేశారు. నిర్మాణ్ భవన్ వద్ద ఉన్న పోలింగ్ బూత్లో ఆమె, సోనియాగాంధీ క్యూలో నిలబడి మరీ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక రాహుల్ గాంధీ తన బ్రాండు కుర్తా పైజమా, హాఫ్ జాకెట్ ధరించి దాదాపు 32 నిమిషాల పాటు క్యూలో నిలబడి ఔరంగజేబ్ లేన్ బూత్లో ఓటేశారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు.
ఇక అరవింద్ కేజ్రీవాల్ అందరికంటే ముందుగా వెళ్లి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. నచ్చిన పార్టీ అభ్యర్థికే ఓట్లు వేయాలి గానీ అసలు ఓటుమాత్రం తప్పకుండా వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ ఒక్కరూ ఇళ్లకు పరిమితం కావొద్దని, తప్పకుండా ఓట్లు వేయడానికి వెళ్లాలని కోరారు. కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయలేదని ఫిర్యాదులు వచ్చాయి గానీ, అధికారులు వాటిని తర్వాత సరిచేశారు. పోలింగ్ ప్రారంభం కాగానే రాహుల్ ఓటు వేసేందుకు వెళ్లిన ఔరంగేజ్ లేన్ లోని ఈవీఎం పనిచేయలేదు. మరికొన్నిచోట్ల తాము ఓటు వేయాలనుకున్నవారికి వేయలేకపోతున్నామని, ఆ బటన్లు పనిచేయడంలేదని చెప్పారు.