బందీలుగా చిక్కిన వారిని కిరాతకంగా నరికేశారు
- 20 మందిని హతమార్చిన ముష్కరులు
- మృతులంతా విదేశీయులే
- 10 గంటల అనంతరం ముగిసిన ఢాకా ఆపరేషన్
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 20మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లో చొరబడిన ముష్కరులు అందులోని వారిని బందీలుగా తీసుకున్న సంగతి తెలిసిందే. 10 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్‌లో భాగంగా ఆరుగురు ఉగ్రవాదులను బంగ్లా భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాయి. ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్న 13మందిని సురక్షితంగా రక్షించాయి. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందారు.
ఆపరేషన్ ముగించి.. రెస్టారెంట్‌లోకి ప్రవేశించిన భద్రతా దళాలకు 20 మంది మృతదేహాలు లభించాయి. వారిని అత్యంత కిరాతకంగా ఉగ్రవాదులు పదునైన ఆయుధాలతో నరికి చంపారని ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ నయీమ్ అష్షాక్ చౌదరి తెలిపారు. ఉగ్రవాదులు చంపిన వారంతా విదేశీయులేనని తెలుస్తోందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కి సురక్షితంగా బయటపడిన 13మందిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. అందులో ఒకరు జపనీస్ కాగా, మరో ఇద్దరు శ్రీలంక వాసులు. ఐఎస్‌ఐఎస్ అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బంగ్లాదేశ్ పోలీసులు భావిస్తున్నారు.