3డీ ఫార్మెట్‌లో ఎందిరన్-2 ?
చెన్నై : ఎందిరన్-2 చిత్రం ప్రారంభం కాకుండానే పలు ఆసక్తి కరమైన విశేషాలతో క్రేజ్‌ను పెంచేసుకుంటోంది. అందుకు ఎందిరన్ సంచలన విజయం ఒక కారణం కాగా,ఆ చిత్ర సృష్టికర్తలు గ్రేట్ డెరైక్టర్ శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో కారణం. టెక్నాలజీ పరంగా అబ్బుర పరచిన ఆ చిత్రానికి సీక్వెల్ రంగం సిద్ధం అవడంతో ఎందిరన్-2 పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఇప్పటికే ఎందిరన్-2 చిత్ర కథను పకడ్బంధీగా సిద్ధం చేసిన శంకర్ ఇప్పుడా కథకు పర్ఫెక్ట్ ఆర్టిస్టులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.అయితే ఈ చిత్రంలో సూపర్‌స్టార్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనే, కత్రినాకైఫ్, ఇంకా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిలో ఎవరు ఎందిరన్-2లో నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్‌తో ఢీకొనే ప్రతినాయకుడు ఎవరన్న అంశంలోనూ చాలా కుతూహలం కలిగిస్తోంది. నటుడు విక్రమ్ రజనీకి విలన్‌గా మారనున్నారనే ప్రచారం జరిగింది.అయితే ఆ ప్రపోజల్ నిర్మాతలకు అంతగా నచ్చలేదనే టాక్ వినిపిస్తోంది. ఇక పోతే ఈ చిత్రాన్ని ఎందిరన్ చిత్రం కంటే రెట్టింపు బడ్జెట్‌లో నిర్మించడానికి లైకా సంస్థ సన్నాహాలు చేస్తునట్లు సమాచారం. చిత్ర షూటింగ్‌కు ముహుర్తం కూడా నిర్ణయించేశారు.
సూపర్‌స్టార్ పుట్టిన రోజు డిసెంబర్ 12న పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టి 2016లో రెగ్యులర్ చిత్రీకరణకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. కాగా ఎందిరన్ చిత్రాన్ని గ్రాఫిక్స్‌తో బ్రహ్మాండంగా తెరపై ఆవిష్కరించిన శంకర్ ఎందిరన్-2 ను అదనంగా 3డీ హంగులు అద్దనున్నట్లు తాజా సమాచారం.
బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, యానిమేషన్ చిత్రం వరకూ నటించిన ఏకైక కోలీవుడ్ నటుడిగా చరిత్రకెక్కిన మన సూపర్‌స్టార్ ఇప్పుడు ఎందిరన్-2 3డీలో తెరకెక్కితే 3డీచిత్రంలో నటించిన తొలి కోలీవుడ్ నటుడిగా మరో రికార్డ్ సాధిస్తారన్న మాట.ప్రస్తుతం రజనీకాంత్ కబాలి చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.