
ట్రంప్ వ్యతిరేక ర్యాలీలో కాల్పులు
సీటిల్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికకు వ్యతిరేకంగా సీటిల్ నగరంలో జరిగిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు గాయపడగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంత మంది వ్యక్తుల మధ్య వాగ్వాదమే ఘటనకు కారణమని చెప్పారు. అయితే, ఆ వాగ్వాదం ట్రంప్ ఎన్నికపై కాదని తెలిపారు.
ర్యాలీలో ఉన్న వ్యక్తితో గొడవ పడిన మరో వ్యక్తి జన సమూహం నుంచి బయటకు వచ్చి కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పారు. ర్యాలీ వద్దే ఉన్న పోలీసు, ఫైర్ డిపార్ట్ మెంట్ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్ధలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.