ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఏడుగురిపై కేసు
ఒక మతాన్ని కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలను ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఏడుగురు యువకులపై కేసు నమోదైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ ప్రాంతంలో జరిగింది. ఐపీసీ సెక్షన్లు 153 బి, 295ఎ, 504తో పాటు ఐటీ చట్టం కింద ఈ కేసులు నమోదు చేశారు. విపుల్ సింగ్ అనే వ్యక్తి ఈ పోస్ట్ రాయడంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జూన్ 20వ తేదీన విపుల్ సింగ్ ఫేస్బుక్ అకౌంటులో ఈ కామెంట్లు పోస్ట్ చేయగా, మిగిలిన ఆరుగురు దాన్ని లైక్ చేయడమో, కామెంట్లు పెట్టడమో చేశారని ఏఎస్పీ దినేష్ త్రిపాఠీ చెప్పారు. బీఎస్పీ నాయకుడి నేతృత్వంలోని ఓ వర్గం సభ్యులు కొత్వాలీ పోలీసు స్టేషన్కు చేరుకుని నినాదాలు చేస్తూ విపుల్ సింగ్ ఫేస్బుక్ కామెంట్లపై ఫిర్యాదు చేశారు. వెంటనే వివిధ స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.