
8 దాటితే ఏటీఎంలలో నగదు నింపరు
ఎటీఎం మెషీన్లో రాత్రి ఎనిమిది గంటలు దాటాక నగదు అయిపోతే ఇక మరుసటి రోజు వరకు ఆగాల్సిందే. ఎటీఎం యంత్రాల్లో నగదును భర్తీ చేసేటపుడు జరుగుతున్న అక్రమాలను అరికట్టి మరింత భద్రతా ప్రమాణాలను చేపట్టడానికి కేంద్రం నడుం బిగించింది. ఇందులో భాగంగా పట్టణాల్లో రాత్రి ఎనిమిది దాటిన తర్వాత ఎటీఎం మెషీన్లలో నగదును భర్తీ చేయకూడదన్న ప్రతిపాదన ఒకటి ఆలోచనలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు గంటల లోపు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల లోపే నగదు భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలంటోంది. ప్రైవేటు క్యాష్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏజెన్సీలు బ్యాంకుల నుంచి మధ్యాహ్నంలోగా నగదును తీసుకెళ్ళి ఏటీఎంలలో భర్తీ చేయాలని కేంద్రం చెబుతోంది. అంతే కాదు ఈ నగదును తీసుకేళ్లే వాహనాలకు సీసీటీవీ, జీపీఎస్‌లతో అనుసంధానం చేయనున్నారు.
ఈ వ్యాన్‌లో గరిష్టంగా రూ. 5 కోట్లకు మించి నగదు తీసుకెళ్లరాదని, అలాగే కాపలాగా ఆయుధాలతో కూడిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉండాలని కేంద్రం పేర్కొంది. భద్రతాపరంగా తీసుకున్న ఈ నిర్ణయాలు బాగానే ఉన్నా అత్యవసర సమయాల్లో నగదు తీసుకోవడం కష్టమవుతుందని మరికొంతమంది నిపుణులు అంటున్నారు. ఈ నిబంధనలు త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది.
పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్.. ఎస్‌బీఐ ‘నో క్యూ’
ఇక నుంచి ఎస్‌బీఐ బ్రాంచీల్లో సేవల కోసం గంటల తరబడి క్యూలో నుంచోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర్లోని ఎస్‌బీఐ బ్రాంచిలో సేవలకు సంబంధించి టోకెన్ నెంబర్‌ను ఇంటి దగ్గర నుంచే తీసుకోవచ్చు. ఇందుకోసం ఎస్‌బీఐ ‘నో క్యూ’పేరుతో మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. మీరు ఉన్న చోట నుంచి 15 కి.మీ పరిధిలోని బ్యాంకులో కావాల్సిన సేవకు సంబంధించి టోకెన్ తీసుకోవచ్చు. మీ టోకెన్ నెంబర్ రావడానికి ఎంత సమయం పడుతుంది, మీరు ఉన్న చోట నుంచి బ్యాంకుకి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందన్న సమాచారం ఈ యాప్ అందిస్తుంది. దీనివల్ల బ్యాంకుల్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదని ఎస్‌బీఐ పేర్కొంది.
ఆన్‌లైన్‌లో ఫండ్స్..
డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ సౌత్ ఏషియన్ స్టాక్ (ఎస్‌ఏఎస్) ఆన్‌లైన్ మ్యూచువల్ ఫండ్ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం వెల్త్‌ఫోర్స్ డాట్‌కామ్ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఎటువంటి చార్జీలు లేకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేసి అమ్ముకోవచ్చని, అలాగే నెలవారి సిప్ ఖాతాలను ప్రారంభించుకోవచ్చని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఎన్‌సీఎంఎస్‌ఎల్
నేషనల్ కోల్లేటరల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ఎన్‌సీఎంఎస్‌ఎల్) గ్రామీణ ప్రాంత రుణ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇందుకోసం ఎన్‌సీఎంఎస్ ఎల్ ఫైనాన్స్ పేరుతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని ఏర్పాటు చేసింది. రూ. 335 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేసిన ఎన్‌సీఎంఎల్ ఫైనాన్స్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాలను అందించనున్నట్లు తెలిపింది.