సినీనటులకు రాజకీయ స్టాండ్ ఉండకూడదట!
న్యూఢిల్లీ: కహానీ, డర్టీపిక్చర్ లాంటి సినిమాలతో విలక్షణనటిగా గుర్తింపు తెచ్చుకుని తనదైన నటనతో దూసుకుపోతున్న బాలీవుడ్ భామ విద్యాబాలన్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు రాజకీయాలపై ఒక వైఖరి తీసుకోకూడదని నేషనల్ అవార్డు విజేత విద్య అభిప్రాయపడ్డారు. రాజకీయాలపై తన వైఖరిని వ్యక‍్తం చేయడం ద్వారా తన అభిమానులను ప్రభావితం చేయడం తనకు ఇష్టముండదని తెలిపారు. అందుకే తాను ఎలాంటి రాజకీయ స్టాండ్ తీసుకోనని వివరించారు.
పద్మావతి ఔట్ డోర్ సెట్ దాడి ఘటనపై స్పందించిన విద్య ఇటీవల కొత్త సినిమాలు యాక్టవిస్టుల దాడులకు కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. ఇది తనను చాలా బాధించిందన్నారు. ఈ దాడులు పెరుగుతున్నాయంటూ విచారం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్‌కు ముందు ఏదో విధంగా వివాదం సృష్టించి దృష్టిని తమవైపు మరల్చుకుంటారని విద్య ఆరోపించారు. పరిశ్రమకు బయట, లోపల ఉన్న కొంతమంది వ్యక్తులు ఇలాంటి వివాదాలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. అలాగే సింగర్ నాహిద్‌కు మద్దతుగా నిలిచారు. కళలకు ఎల్లలు లేవని వ్యాఖ్యానించారు. ఈశ్వర్ ని అయినా.. అల్లా అని అయినా కలుపేది ఆ కళేనని తాను నమ్ముతానని చెప్పారు.
వేశ్యాగృహం నడిపే మహిళ కథ విన్నపుడు వివాదాస్పదమవుతుందని తాను భావించాననీ, కానీ "బేగం జాన్" కు ఎలాంటి కట్ లు లేకుండా సెన్సార్ అనుమతి లభించడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయితే అవసరమైతే నిర్మాత మహేష్ భట్, దర్శకుడు శ్రీజిత ముఖర్జీ ఈ మూవీ కోసం ఫైట్ చేస్తారనే నమ్మకం కూడా తనకు ఉండిందన్నారు. ఈ సినిమాలో చాలా ఆకట్టుకునే బలమైన దృశ్యాలున్నాయని చెప్పారు.
కాగా వేశ్యాగృహం యజమానిగా బేగం జాన్ పాత్రలో విద్యాబాలన్ నటించిన బేగం జాన్ ట్రైలర్‌లో దేశవ్యాప్తంగా పలువురిని విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.