స్టాక్ మార్కెట్లో మరికొంత కాలం... సర్దుబాటు ధోరణే..!
‘సాక్షి’ ఇంటర్వ్యూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సీఐవో మనీష్ కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపి కంపెనీల ఆదాయాలు పెరిగితే స్టాక్ మార్కెట్లో తిరిగి ర్యాలీ మొదలవుతుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంచనా వేస్తోంది. స్టాక్ మార్కెట్లో లక్ష కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్న తొలి ప్రైవేటు రంగ బీమా కంపెనీగా రికార్డులకు ఎక్కిన సందర్భంగా ప్రస్తుత మార్కెట్ల స్థితిగతులపై ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (సీఐవో) మనీష్ కుమార్‌తో
‘సాక్షి’ ఇంటర్వ్యూ...
బడ్జెట్ తర్వాత నుంచి దేశీయ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇది మరింత కొనసాగే అవకాశం ఉందా?
ప్రస్తుత కరెక్షన్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణ ఎన్నికల ఫలితాల (జూన్, 2014) తర్వాత మార్కెట్లు సుదీర్ఘ ర్యాలీ చేయడంతో బడ్జెట్ తర్వాత సర్దుబాటు మొదలయ్యింది. దేశ ఆర్థిక వృద్ధి ఫలాలు వాస్తవ రూపంలోకి వచ్చే వరకు సూచీలు పరిమిత శ్రేణిలో కదులుతాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చి కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరిగినప్పుడే మార్కెట్లో తిరిగి ర్యాలీ ప్రారంభమవుతుంది.
వచ్చే ఏడాది కాలంలో స్టాక్ సూచీల నుంచి ఎటువంటి రాబడులను అంచనా వేస్తున్నారు?
సెన్సెక్స్, నిఫ్టీల రాబడి కార్పొరేట్ కంపెనీల ఆదాయాలను ప్రతిబింబిస్తాయని అంచనా వేస్తున్నాం. కంపెనీల ఆదాయాల్లో ఏమైనా వృద్ధి ఉంటే ఆ మేరకు సూచీలు కూడా పెరుగుతాయి. కానీ చరిత్రను పరిశీలిస్తే మాత్రం.. దేశీయ ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలంలో 13 నుంచి 15 శాతం రాబడిని అందించాయి.
బీమా బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత మోదీ సంస్కరణల అమలుపై మార్కెట్లకు నమ్మకం పెరిగిందా?
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మోదీ ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తుందన్న నమ్మకం ఉంది. బీమా బిల్లు చట్ట సవరణ తర్వాత రానున్న కాలంలో ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రానున్నాయి. భవిష్యత్తు వ్యాపార విస్తరణకు నిధుల కొరతను ఎదుర్కొంటున్న బీమా కంపెనీలకు ఈ బిల్లు పెద్ద ఊరటనిస్తుందని చెప్పొచ్చు.
ఇంటా బయట నుంచి దేశీయ మార్కెట్లు తక్షణం ఎదుర్కొనే నష్టభయాలు ఏమిటి?
గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ల కదలికలను నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత విషయానికి వస్తే... అమెరికా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల వల్ల పెద్ద ఎత్తునున్న ఎఫ్‌ఐఐ నిధులు రావడంతో దేశీయ మార్కెట్లు పరుగులు తీశాయి. ఒకవేళ అమెరికా వడ్డీరేట్లు పెంచితే ఆ మేరకు నిధులపై తప్పక ప్రభావం కనిపిస్తుంది. అలాగే దేశాల మధ్య ఏమైనా యుద్ధాలు వచ్చినా, ఓపెక్ దేశాలు ముడిచమురు ఉత్పత్తిని తగ్గించినా ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు అంతర్జాతీయ విషయాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. ఇక స్థానిక విషయాలకొస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో జాప్యం జరిగితే మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తాయి.
అంటే..అమెరికా వడ్డీరేట్లు పెంచితే ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం తగ్గి మార్కెట్లు మరింతగా పతనమయ్యే అవకాశం ఉందా?
అమెరికా వడ్డీరేట్లు పెంచితే ఇండియాతో సహా అన్ని వర్ధమాన దేశాల మార్కెట్లలో ఒడిదుడుకులు పెరుగుతాయి. కానీ ఇండియా విషయానికి వస్తే ఈ ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఈ అంశాన్ని ఇప్పటికే మార్కెట్లు చాలామటుకు డిస్కౌంట్ చేసుకున్నాయి. అలాగే... ఒకవేళ అమెరికా వడ్డీరేట్లు పెంచితే అదే సమయంలో యూరప్, జపాన్ దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు పెంచే అవకాశం ఉంది. దీంతో అమెరికా నుంచి తగ్గే ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహాన్ని యూరప్, జపాన్ దేశాల నిధులు భర్తీ చేయవచ్చు.
వచ్చే ఏడాది కాలంలో దేశీయ మార్కెట్లో వడ్డీరేట్లు ఇంకా ఎంత వరకు తగ్గే అవకాశం ఉంది?
ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటికే అరశాతం వడ్డీరేట్లు తగ్గడం చూశాం. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ఆర్థిక వృద్ధిరేటు బలహీనంగా ఉంటంతో వడ్డీరేట్లు మరింత తగ్గడానికే అవకాశాలున్నాయి. డిసెంబర్‌లోగా వడ్డీరేట్లు మరో అరశాతం తగ్గొచ్చని అంచనా.
సూచీలు నూతన రికార్డులు నెలకొల్పిన తర్వాత యులిప్ పథకాల అమ్మకాలు ఏమైనా పెరిగాయా?...
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో యులిప్స్ పథకాల్లో పెట్టుబడులు పెరగడం స్పష్టంగా కనిపించింది. రానున్న కాలంలో మార్కెట్ పరిస్థితులు బాగుండే అవకాశాలుండటంతో యులిప్స్ అమ్మకాలు పెరుగుతాయని విశ్వసిస్తున్నాం. ఇది మార్కెట్ల వృద్ధికి మరింత దోహదం చేస్తుంది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఏ రంగ షేర్లపై ఆసక్తి చూపుతున్నారు? వేటికి దూరంగా ఉండమని సూచిస్తారు?
దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వడ్డీరేట్ల కదలికతో నేరుగా సంబంధం ఉన్న ప్రైవేటు బ్యాంకులు, ఆటో రంగ షేర్లతో పాటు టెలికం షేర్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్, కమోడిటీ రంగాల షేర్లకు దూరంగా ఉండమని సూచిస్తా.