సాక్షి, న్యూఢిల్లీ: మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలో ఈ ఏడాది ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. వైద్య సీట్ల భర్తీకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ ఆర్.దవే, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. భారత వైద్య మండలి (ఎంసీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఎంఎన్‌ఆర్ కళాశాలలోని జూనియర్ వైద్యుడికి అర్హతలు లేవని తేలడంతో కళాశాలకు అనుమతి ఇవ్వలేదని, అయినా ప్రవేశాలను చేపట్టిందని భారత వైద్య మండలి తరపు న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు.
దీనిపై వైద్యకళాశాల తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ స్పందిస్తూ... ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలో లోపాలు లేవని పేర్కొన్నారు. సీట్ల భర్తీకి ఎంసీఐ అనుమతిని నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును సంప్రదించగా.. అనుమతి ఇచ్చిందన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రవేశాలు నిర్వహించినట్టు వివరించారు. జూనియర్ వైద్యుడి అర్హత విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఎంసీఐకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అనంతరం సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాదికి ఎంఎన్‌ఆర్ కాలేజీలో ప్రవేశాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీలో ప్రవేశాలు రద్దు
Published Sat, Oct 17 2015 2:56 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM
Advertisement
Advertisement