పీఎఫ్ చందాదారులకు చౌక ధరల్లో గృహాలు!
మెగా హౌసింగ్ స్కీమ్‌పై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: పీఎఫ్ చందాదారులకు చౌకధరల్లో ఇళ్లు అందించే మెగా హౌసింగ్ స్కీమ్‌ను కార్మిక మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ)లోని 5 కోట్ల మంది చందాదారులకు అందుబాటు ధరల్లో గృహాలను అందించడం కోసం ఈ స్కీమ్‌ను రూపొందిస్తున్నారని సమాచారం. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా కార్మిక శాఖ ఈ ప్రయత్నాలు చేస్తోంది.
ఈపీఎఫ్‌ఓ తన చందాదారుల కోసం అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించాలని, ఈపీఎఫ్‌ఓ నిధులను ఇందుకోసం వినియోగించాలని ఇటీవలనే ప్రధాని కార్యాలయం ఈపీఎఫ్‌ఓను కోరింది. ఈపీఎఫ్‌ఓ నిధుల్లో 15 శాతాన్ని అందుబాటు ధరల్లో గృహా రుణాల కోసం కేటాయిస్తే, రూ.70,000 కోట్ల రుణాలను, 3.5 లక్షల అదనపు చౌక-ధర గృహాలను అందించవచ్చని అంచనా. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ రూ.6.5 లక్షల కోట్ల నిధులను నిర్వహిస్తోంది. ప్రతీ ఏటా ఉపాంత డిపాజిట్లు రూ.70,000 కోట్ల మేర పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓలో నెలకు రూ.15,000 మూల వేతనం కంటే త క్కువగా ఆర్జించేవారి సంఖ్య 70% ఉంది. ఈ మెగా హౌసింగ్ స్కీమ్ కోసం ఆర్ధిక సంస్థలు తక్కువ వడ్డీరేట్లకే రుణాలిచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
స్కీమ్ ఎలా ఉండొచ్చు..
ఈ స్కీమ్ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్‌బీసీసీ వంటి ప్రభుత్వ నిర్మాణ రంగ కంపెనీలు, డీడీఏ, పుడా, హుడా వంటి సంస్థలతో కలసి పనిచేయాలని కార్మిక శాఖ యోచిస్తోంది. తక్కువ ఆదాయ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని కార్మిక శాఖ ఈ స్కీమ్‌ను రూపొందిస్తోంది. ఇంటి ధరలో కొంత మొత్తాన్ని చెల్లించడానికి పీఎఫ్ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవడానికి చందాదారులను అనుమతించవచ్చు.
తక్కువ ఆదాయ వర్గాలకు సబ్సిడీలను కూడా అందించే అవకాశాలున్నాయి. సదరు స్కీమ్ కోసం ఈపీఎఫ్‌ఓ చందాదారులను-తక్కువ ఆదాయం, మధ్య ఆదాయం, అధిక ఆదాయం... ఇలా మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. ఇళ్లు, ఇతర ప్రోత్సాహాకాలను ఈ ఆదాయాలను బట్టి అందిస్తారు. సభ్యులు తమ పీఎఫ్ అకౌంట్ల ద్వారానే గృహ రుణాల ఈఎంఐల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.