ఎయిర్ ఇండియాలో సమ్మె?
న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో మరోసారి అలజడి రేగింది. కేంద్ర కార్మిక శాఖ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెజారిటీ పైలట్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఫ్లైట్ కమాండర్స్ ను వర్క్ మెన్ జాబితా నుంచి తొలగిస్తూ కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్(ఐసీపీఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఎయిర్ ఇండియా యాజమాన్యానికి రెండు రోజుల్లో సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ఐసీపీఏ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కె కీర్తి తెలిపారు. సమ్మెకు ఐసీపీఏ నాలుగు విభాగాలు పూర్తి మద్దతు తెలిపాయని అన్నారు. రహస్య ఓటింగ్ ద్వారా సమ్మెపై అభిప్రాయాన్ని తెలుసుకున్నామని వెల్లడించారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 మధ్య కాలంలో ఓటింగ్ నిర్వహించినట్టు చెప్పారు.
ఎయిర్ ఇండియాలో మొత్తం 3,500 మంది కేబిన్ క్రూ సిబ్బంది ఉండగా వీరిలో 2,200 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా మిగతావారు కాంట్రాక్టుపై పనిచేస్తున్నారు.