
గవర్నర్ ముందు 4 ఆప్షన్స్!
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అధికారం ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ విద్యాసాగర్ రావు ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పవర్ కోసం పోటీ పడుతుండగా గవర్నర్ ఎవరివైపు మొగ్గు చూపుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ముందు నాలుగు మార్గాలున్నాయని నిపుణులు అంటున్నారు.
1. శశికళను వేచి ఉండమని చెప్పడం
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన రూ. 66.65 కోట్ల అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది. అప్పటివరకు శశికళను వేచివుండమని చెప్పే అవకాశముంది.
2. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం
మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని చెప్పుకుంటున్న శశికళ నటరాజన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించి తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకోమనవచ్చు.
3. పన్నీర్ కు మరో అవకాశం
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వంకు మరో అవకాశం ఇవ్వొచ్చు. రాజీనామా వెనక్కు తీసుకోవడానికి సిద్ధమని సెల్వం ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. అయితే తర్వాత బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.
4. రాష్ట్రపతి పాలన
అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం సమసిపోయే మార్గాలు కనిపించకుంటే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ ప్రతిపాదించే అవకాశముంది. అయితే పన్నీరు సెల్వం, శశికళ వాదనలు విన్న తర్వాతే దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ నాలుగు మార్గాల్లో గవర్నర్ దీన్ని ఎంచుకుంటారనే దానిపై ఉత్కంత నెలకొంది.