విమానాశ్రయాల్లో తనిఖీ సమయం సగానికి తగ్గింపు
న్యూడిల్లీ: తరచూ విమానాల్లో ప్రయాణిస్తూ సిబ్బంది తనిఖీలతో విసుగెత్తి ఉన్నవారికో శుభవార్త. తనిఖీ సమయాన్ని సగానికి తగ్గించాలని కేంద్ర పారిశ్రామిక భదత్రా సిబ్బంది (సీఐఎస్‌ఎఫ్) నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 59 పౌర విమానాశ్రయాల్లో తనిఖీలకోసం కొత్తగా ఫోర్ పాయింట్ ఫార్ములాను తయారు చేసింది. ప్రస్తుతం విమానాశ్రయాల్లో ఒక్కో వ్యక్తిని తనిఖీ చేయడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల సమయం పడుతోంది. ఈ సమయాన్ని నాలుగు నిమిషాలకు తగ్గించనున్నామని సీఐఎస్‌ఎఫ్ విమానాశ్రయ భద్రతా యూనిట్ ప్రధానాధికారి ఓ.పి.సింగ్ తెలిపారు. కొత్తగా తయారు చేసిన ఈ యంత్రాంగం ద్వారా ప్రయాణికుడు సరైన వ్యక్తేనా, నకిలీనా, అనుమానస్పదుడా అనే విషయాన్ని భద్రతా సిబ్బంది సులభంగా గుర్తించగలుగుతారు.
దీని తరువాత భద్రతా సిబ్బంది ప్రయాణికుడి విమాన టిక్కెట్‌లో ఉన్న నంబర్, తేదీ, సమయం, సరైన గుర్తింపు కార్డు ఉందా లేదా అని తనిఖీ చేస్తారని సీఐఎస్‌ఎఫ్ అదనపు డెరైక్టర్ జనరల్ సింగ్ తెలిపారు. దేశంలో అనేక విమానాశ్రయాల్లో తనిఖీలకోసం ఎదురుచూస్తూ ప్రయణికులు ఇబ్బంది పడుతున్నారని ఓ సర్వేలో తేలడంతో భద్రతా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కొత్త పద్ధతులను ఇందిరాగాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ప్రయోగించామని, వచ్చేవారం నుంచి దీనిని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బందికి అందజేస్తామని సింగ్ తెలిపారు. అయితే ప్రయాణికులు తప్పనిసరిగా విమాన టిక్కెట్‌ను అందుబాటులో ఉంచుకోవాలని, లేని యెడల టికెట్ పీడీఎఫ్ కాపీనీ ఫోన్‌లోనైనా సీఐఎస్‌ఎఫ్ అధికారి చెప్పారు. దీనివల్ల తనిఖీ సమయం ఇంకా తగ్గుతుందని సింగ్ తెలిపారు.