భారత్-అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని అమెరికా, భారత్‌లు నిర్ణయించాయి. సముద్ర భద్రత, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాల్లో కలసి పనిచేయాలని సంకల్పించాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గత మూడు రోజుల్లో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్, అంతర్గత భద్రత మంత్రి జాన్ కెల్లీతోపాటు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు హెచ్ మెక్‌మాస్టర్‌లతో సమావేశమై చర్చలు జరిపారు. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల కోసం భారత్ చేస్తున్న కృషిని మాటిస్ కొనియాడారని పెంటగాన్ ప్రతినిధి జెఫ్ డేవిస్ వెల్లడించారు.
జాన్ కెల్లీతో దోవల్ జరిపిన చర్చల్లో సరిహద్దు నియంత్రణ, ఉగ్రవాదం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చర్చ జరగలేదని సమాచారం. న్యూఢిల్లీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు దోవల్ జరిపిన చర్చలప్ర ట్రంప్ ప్రభుత్వ అధికారులు అమితాసక్తి కనబరిచారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డీమోనిటైజేషన్, జీఎస్టీ బిల్లు గురించి చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపాయి. భారత్ ఆర్థికాభివృద్ధి అంశాలపై అమెరికా ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించాయి.