సోమాలియాలో మోహరించిన బలగాలను వెంటనే ఉపసంహరించాలని ఆ దేశానికి చెందిన తీవ్రవాద సంస్థ అల్ షబాబ్ నాయకుడు అహ్మద్ అబ్ది గాడ్ని కెన్యాను డిమాండ్ చేశారు. లేని పక్షంలో వెస్ట్గేట్ వాణిజ్య సముదాయంపై దాడి తరహా మరిన్ని దాడులకు తెగబడతామని ఆయన కెన్యాను హెచ్చరించారు. ఈ మేరకు అహ్మద్ అబ్ది ప్రసంగించిన ఆడియో క్యాసెట్ సోమాలియా రాజధాని మొగదిషులో గురువారం విడుదల అయింది. తామ చేసే దాడుల వల్ల కెన్యా ఆర్థికంగా పతనం కాక తప్పదని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.
గతంలో సోమాలియాలోని కెన్యా వాసులను అల్ షబాబ్ తీవ్రవాద సంస్థ కిడ్నాప్ చేసింది. ఆ ఘటనపై కెన్యా తీవ్రంగా మండిపడింది. అందుకు ప్రతిగా 2011, ఆక్టోబర్లో సోమాలియాలో కెన్యా వేలాది భద్రత దళాలను మోహరించింది. కెన్యా తీసుకున్న నిర్ణయం పట్ల అల్ షబాబ్ మండిపడింది. అందులో బాగంగా వీలు చిక్కిన ప్రతిసారి అల్ షబాబ్ కెన్యాపై దాడికి తెగబడుతోంది.
అందులో భాగంగానే శనివారం వెస్ట్గేట్ వాణిజ్య సముదాయంపై ఆ తీవ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. ఆ ఘటనలో మొత్తం 72 మంది మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడి కెన్యా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఘాతుక చర్యకు నిరసనగా నేటి నుంచి మూడు రోజుల పాటు సంతాపదినాలను కెన్యా ప్రకటించింది.