అమర్నాథ్ యాత్ర పునః ప్రారంభం
జమ్ము: ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం చెలరేగిన ఆందోళనలు అదుపులోకి వస్తుండటంతో అమర్ నాథ్ యాత్రపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గడిచిన మూడు రోజులుగా నిలిచిపోయిన యాత్రను సోమవారం మధ్యాహ్నం నుంచి పునఃప్రారంభించారు. దీంతో జమ్ములో చిక్కుకుపోయిన వేలాది మంది భక్తులు ఊపిరి పీల్చుకున్నట్లయింది. మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలిరావడం, అదే సమయంలో కశ్మీర్ లోయలో ఆందోళనలు జరగడడంతో సర్వత్రా ఆందోళనక పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. (చదవండి: అమర్‌నాథ్‌లో మనోళ్ల పాట్లు)
జమ్ము సిటీ లోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి సోమవారం సాయంత్రం దాదాపు 40 బస్సులు అమర్ నాథ్ వైపునకు బయలుదేరాయని, యాత్రికుల కాన్వాయ్ కి భారీ భధ్రత కల్పిస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. కాగా, ఇప్పటికే యాత్ర ముగించుకుని 200 బస్సుల ద్వారా జమ్ముకు చేరుకోనున్న వారి కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు, రైలు జమ్ము స్టేషన్ నుంచి సోమవారం రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని అదికారులు పేర్కొన్నారు.