అమెజాన్ బిల్డింగ్ పైనుంచి దూకేసిన ఉద్యోగి..
అమెజాన్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సీటిల్ లోని కంపెనీ కేంద్ర కార్యాలయంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు ఉద్యోగి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పారు. అంతకుముందు తోటి ఉద్యోగులకు, కంపెనీ సీఈవో జెఫ్ బెజోస్ కు ఆయన ఓ ఈ-మెయిల్ పంపారని తెలిపారు.
సోమవారం ఉదయం 8.45 గంటల సమయంలో 12 అంతస్తుల అమెజాన్ అపోలో బిల్డింగ్ నుంచి ఉద్యోగి దూకినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం తనను వేరే డిపార్ట్ మెంటుకు పంపాలని సదరు ఉద్యోగి కోరినట్లు తెలిసింది. కానీ అతన్ని ఇంప్రూవ్ మెంట్ ప్లాన్(పర్ఫార్మెన్స్ మెరుగుపర్చుకోకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తారు)లో వేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి చెప్పారు.
ఈ-మెయిల్ సారాంశంలో డిపార్ట్ మెంటును మార్చాలనే అభ్యర్ధనను కంపెనీ తీసుకున్న తీరు తనను కలిచివేసిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారని తెలిసింది. అమెజాన్ కేంద్ర కార్యాలయంలో 20వేల మంది పని చేస్తున్నారు. ఘటనపై స్పందించిన అమెజాన్ తమ ఉద్యోగి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఆ ఉద్యోగి వివరాలను కంపెనీ బయటకు వెల్లడించలేదు.