అన్యాయాన్ని సరిదిద్దడానికే సవరణ
* కేంద్ర మంత్రి వెంకయ్య స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో జరిగిన అన్యాయం, పొరపాటు సరిదిద్దడానికే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తెస్తామంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం తగదని పేర్కొన్నారు. చట్ట సవరణను కొందరు మొండిగా వ్యతిరేకించడమే కాకుండా, దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ విషయంలో వస్తున్న విమర్శలపై వెంకయ్య బుధవారం మీడియాతో మాట్లాడారు.
రాజ్యసభలో ఏపీ ఎంపీలు తెలంగాణకు, తెలంగాణ ఎంపీలు ఏపీకి కేటాయింపు జరిగిందన్నారు. ఎమ్మెల్సీల సంఖ్య విషయంలో కూడా అలాగే జరిగిందంటూ.. ప్రభుత్వం వీటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.
‘ఏపీ ఎంపీలు తెలంగాణలో, తెలంగాణ ఎంపీలు ఏపీలోనే ఉండాలని, శాసనమండలిలో ఏపీ, తెలంగాణ ప్రజలకు సముచిత ప్రాతినిధ్యం దక్కకూడదని సవరణను వ్యతిరేకించేవారు భావిస్తే చేయగలిగిందేమీ లేదు..’ అని పేర్కొన్నారు. చట్ట సవరణకు, ప్రత్యేక హోదాకు సంబంధం లేదని, ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ అభివృద్ధి మండలి చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.