కొన్ని విజయాలు.. కొన్ని వెనుకబాట్లు | American experts to comment on Modi's regime two years | Sakshi
Sakshi News home page

కొన్ని విజయాలు.. కొన్ని వెనుకబాట్లు

Published Fri, Mar 18 2016 12:49 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

కొన్ని విజయాలు.. కొన్ని వెనుకబాట్లు - Sakshi

కొన్ని విజయాలు.. కొన్ని వెనుకబాట్లు

రెండేళ్ల మోదీ పాలనపై అమెరికన్ నిపుణుల వ్యాఖ్య
 

వాషింగ్టన్: కొన్ని విజయాలు.. కొన్ని వెనుకబాట్లు... వెరసి భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనలో మిశ్రమ ఫలితాలు సాధించారని అమెరికన్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ రెసిడెంట్ ఫెలో, వాల్‌స్ట్రీట్ జర్నల్ కాలమిస్ట్ అయిన సదానంద్ ధూమే అమెరికా చట్టసభ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ రెండేళ్ల పాలనపై వ్యాఖ్యానిస్తూ.. మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరచడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించిందన్నారు. ప్రతిపక్షం అడ్డం కులు సృష్టించడం వల్లనో లేదా ధైర్యంగా నిర్ణయం తీసుకోలేక పోవడం వల్లనో సమూలంగా సంస్కరణలు చేయలేకపోయిందన్నారు. లోక్‌సభలో చాలినంత మెజారిటీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వ చట్టాలను మార్చడానికి మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. అయితే మోదీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సడలించిందని.. రక్షణ, బీమా, ఆహార రంగాల్లో చాలా ప్రగతి సాధించిం దని అన్నారు. బలమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు అమెరికా ప్రోత్సాహం కొనసాగాలని ఆయన సూచించారు. అమెరికాకు కూడా భారత్ తో వ్యాపార సంబంధాలు అవసరమన్నారు. యూఎస్-భారత్ పాలసీ స్టడీస్ సెంటర్ ఫర్ స్ట్రేటజిక్, ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రతినిధి రిచర్డ్ ఎం రోసో, ఇతర వ్యాఖ్యాతలు మోదీ మరిన్ని సంస్కరణలు చేయాలని చెప్పారు.
 
ఇంటర్నెట్ స్టార్‌గా ప్రధాని మోదీ
న్యూయార్క్: ప్రధాన మంత్రి మోదీ వరుసగా రెండో ఏడాదీ ఇంటర్నెట్ లో అత్యంత ప్రభావవంత వ్యక్తుల్లో ఒకరిగా నిలి చారు. ఈ ఏడాది ఇంట ర్నెట్‌లో అత్యంత ప్రభావవంతమైన 30 మంది వ్యక్తుల్లో మోదీని ఒకరిగా ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ టైమ్ చేర్చింది. దౌత్య సంబంధాలకు సామాజిక మాధ్యమ వెబ్‌సైట్లను తరచూ ఉపయోగించే మోదీని ఇంటర్నెట్ స్టార్‌గా ‘టైమ్’ అభివర్ణించింది. గతేడాది పాకిస్తాన్‌లో చేపట్టిన ఆకస్మిక పర్యటన గురించి మోదీ అనూహ్యంగా ట్విటర్ ద్వారా ప్రకటించడాన్ని ప్రస్తావించింది. సో షల్ మీడియాపై పోటీదారులు చూపిన ప్రపంచస్థాయి ప్రభా వం, వార్తలను మలచడంలో వారికి ఉన్న సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. జాబితాలో స్థానం సంపాదించిన వారిలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్, ‘హ్యారీపాటర్’ రచయిత్రి జేకే రౌలింగ్, సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు. మోదీకి 1.8 కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లు ఉన్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement