నా ఉద్యోగమూ అందుకే పోయింది..
బెంగళూరు: ప్రముఖ ఆన్ లైన్ రీటైల్ వ్యాపార దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో సచిన్ బన్సాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరియైన ప్రమాణాలు లేకనే తనను కూడా కంపెనీ అధిపతి పదవి నుంచి తొలగించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా మెరుగైన నైపుణ్యాన్ని ప్రదర్శించని ఉద్యోగులపై వేటు తప్పదని భారతదేశ అతిపెద్ద ఇ కామర్స్ స్పష్టం చేసింది.
సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో నిర్వహించిన టౌన్హాల్ సమావేశంలో శుక్రవారం ప్రసంగించిన ఆయన పెర్ ఫామెన్స్ కారణంగా తనను సీఈవో పదవినుంచి తొలగించారంటూ ఉద్యోగులకు అంతర్లీనంగా ఒక హెచ్చరికను జారీ చేశారు. గత జనవరిలో సీఈవో ఉన్న సచిన్ స్థానంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిన్నీ బన్సాల్ ను కంపెనీ ప్రమోట్ చేసింది. సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ ఇద్దరు అమెజాన్ మాజీ ఉద్యోగులే.
సంస్థ విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న టౌన్హాల్ సమావేశం ఉద్యోగులెవరైనా ఏ సమస్యపైనైనా ప్రశ్నించే హక్కు కల్పిస్తుందని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుత నిబంధనలు, లీడర్ షిప్ బాధ్యతలు, వ్యాపారం తదితర వ్యవహారాలపై బహిరంగ చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.
కాగా 2007లో ఇ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టిన ఫ్లిప్కార్ట్, ప్రత్యర్థి స్నాప్డీల్, అమెజాన్ లకు ధీటుగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇటీవల 70 మిలియన్ డాలర్లకు ఫ్యాషన్ సైట్ జబాంగ్ ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఫ్లిప్కార్ట్ ఆదాయం ఈ సంవత్సరం15 బిలియన్ డాలర్ల నుంచి 11 బిలియన్ డాలర్లకు పడిపోయింది. పేలవమైన ప్రదర్శన కారణంగా దాదాపు 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.