బీజేపీ అధ్యక్ష రేసులో మోడీ సన్నిహితుడు?
లోక్సభ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన నరేంద్ర మోడీ సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా పేరు పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి విన్పిస్తోంది. రాజ్నాథ్ సింగ్ వారసుడిగా షాకు ఛాన్స్ దక్కే అవకాశముందని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో పార్టీని విజయపథంలో నడిపించిన అమిత్ షా అధ్యక్ష పదవి రేసులో పోటీదారుల కంటే ముందున్నారని భావిస్తున్నారు.
బీజేపీ మరో ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాశ్ నద్దా పేరు కూడా పార్టీ అధ్యక్ష పదవికి బలంగా విన్పిస్తోంది. అమిత్ షా కంటే ముందే నద్దా పేరు తెరపైకి వచ్చింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో నద్దా క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయడంలో చాకచాక్యంగా వ్యవహరించారు.
ప్రచారానికి దూరంగా ఉండే నద్దా పార్లమెంట్ గత సమావేశాల్లో రాజ్యసభలో చేసిన ప్రసంగం ద్వారా సీనియర్లను ఆకట్టుకున్నారు. ప్రభుత్వానికి ఆచరణ సాధ్యమైన సూచనలిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని మోడీ, పార్టీలు పెద్దలు, ఆర్ఎస్ఎస్ అండతో తనకు అధ్యక్ష పదవికి ఖాయమన్న దీమాతో ఉన్నారు. అమిత్ షాతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి. వీరిద్దరూ భారతీయ యువ జనతా మోర్చాలో పనిచేసిన వారే.
అయితే అనూహ్యంగా అమిత్ షా పేరు వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష పదవి పీఠంపై ఆయనను కూర్చోబెడితే ఎలా ఉంటుందన్న చర్చ బీజేపీలో మొదలయిందని సమాచారం. ఉత్తరప్రదేశ్ లో అమిత్ షా అవలంభించిన వ్యూహాల కారణంగానే బీజేపీ పెద్ద సంఖ్యలో లోక్సభ సీట్లు గెల్చుకుందని అధిష్టానం నమ్ముతోంది. ఇదే వ్యూహాన్ని దేశమంతా అమలు చేస్తే పార్టీకి తిరుగుండదని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా పేరు తెరపైకి వచ్చింది. మోడీ సన్నిహితుడైన షాను అధ్యక్షుడిగా అద్వానీ వర్గం వ్యతిరేకించే అవకాశముంది.