స్మార్ట్ఫోన్లే టార్గెట్గా...
వాషింగ్టన్ : ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా గూగుల్ ఖాతాదారులను టార్గెట్ చేస్తున్న షాకింగ్ న్యూస్ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. హ్యాకర్లు తమ రూటు మార్చి మొబైల్ ఫోన్ల ను తమ టార్గెట్ గా ఎంచుకున్నట్టు టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించబడిన గూలిగ్యాన్ అనే హానికరమైన సాఫ్ట్ వేర్ ద్వారా పదిలక్షల (మిలియన్)కు పైగా గూగుల్ వినియోగదారుల ఖాతాలను హ్యాక్ చేసినట్టు భద్రతా పరిశోధకులు బుధవారం చెప్పారు. చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ నివేదిక ప్రకారం గూలిగాన్ అనే మాల్వేర్ తో గూగుల్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించే ఆండ్రాయిడ్ 4.0 , 5.0 స్మార్ట్ ఫోన్ల ద్వారా హ్యాకర్లు దాడికి దిగుతున్నారు. తద్వారా లక్షలమంది వినియోగాదారుల జీమెయిల్స్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని బాంబు పేల్చింది.
సాధారణంగా యాప్ లు డౌన్ లోడ్ చేసుకుంటున్న సందర్భంలోనూ, లేదా ఫిషింగ్ మేసెజెస్, హానికరమైన లింక్ లు, మెసేజ్ లను క్లిక్ చేయడం ద్వారా ఈ దాడి ప్రారంభమవుతోందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2016 ఆగస్టులో ప్రవేశపెట్టిన గూలిగ్యాన్ అప్లికేషన్ ద్వారా రోజుకు 37 వేల డివైస్ లు హ్యాక్ అవుతున్నట్టు తెలిపింది. వీటిల్లో 57 శాతం స్మార్ట్ ఫోన్లు ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో, సుమారు తొమ్మిది శాతం యూరోప్ లో ఉన్నట్టు తమ పరిశోధకులు గుర్తించారని పేర్కొంది. ఇలా ఈ మెయిల్స్, ఫోటోలు సహా, డాక్యుమెంట్లు, ఇతర సెన్సిటివ్ డ్యాటాను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతోపాటు గూగుల్ ప్లే ద్వారా కూడా వినియోగదారుల డాటాను తస్కరించే అవకాశంఉందని తెలిపింది. యాప్ లను డౌన్ లోడ్ సందర్భంగా ఖాతాదారుడు రేటింగ్ పై క్లిక్ చేసినపుడు ఎటాక్ చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి మొత్తం సమాచారాన్ని గూగుల్ సంస్థకి రిపోర్ట్ చేశామన్నారు. ఈ మాల్వేర్ పై విచారించి. వినియోగదారుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. అయితే ఈ తాజా హ్యాకింగ్ అలజడిపై టెక్ దిగ్గజం గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.