
‘నోబెల్ శాంతి’ రేసులో మెర్కెల్
ఓస్లో: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ ముందంజలో ఉన్నారు. నోబెల్ అవార్డులన్నింటిలోనూ ఓస్లోలో ప్రదానం చేసే ఏకైక అవార్డైన శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారనుంది. శుక్రవారం ప్రకటించనున్న ఈ అవార్డుకు నామినీల పేర్లను ఎప్పటిలాగే రహస్యంగా ఉంచారు. శాంతి బహుమతి కోసం ఈ ఏడాది 273 మంది పేర్లను పరిశీలించినట్లు సమాచారం.
ఈ ఏడాది ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేసిన వలసల సంక్షోభాన్ని నివారించేందుకు కృషి చేసిన వారికి అవార్డు దక్కుతుందని పరిశీలకుల అంచనా. పశ్చిమాసియా, ఆఫ్రికాల నుంచి ఐరోపాకు 6 లక్షల 30 వేల మంది వలస వెళ్లారు. వీరిని ఆదుకోవటానికి నైతిక నాయకత్వం వహించిన మెర్కెల్‌కు శాంతి బహుమతి దక్కే అవకాశాలున్నాయని ఓస్లో శాంతి పరిశోధన సంస్థ చీఫ్ హార్ప్‌వికెన్ అన్నారు. ఇరాన్‌తో అణు ఒప్పందం ఖరారులో విజయం సాధించిన జాన్ కెర్రీ, ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్‌లకు కూడా అవకాశాలున్నాయి.