4 పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్ కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన నాలుగు సంస్థల్లో (పీఎస్‌యూ) వాటాల విక్రయ (డిజిన్వెస్ట్‌మెంట్) ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం లోక్‌సభకు తెలిపారు. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 22,574 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు.
డిజిన్వెస్ట్‌మెంట్ జాబితాలో ఓఎన్‌జీసీ, ఎన్‌ఎండీసీ, నాల్కో, బీహెచ్‌ఈఎల్ సంస్థలు ఉన్నాయి. ఓఎన్‌జీసీలో 5 శాతం వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 13,217 కోట్లు, ఎన్‌ఎండీసీ, నాల్కోల్లో చెరి పది శాతం వాటాల విక్రయంతో మొత్తం రూ. 6,228 కోట్లు, బీహెచ్‌ఈఎల్‌లో 5 శాతం వాటాల విక్రయంతో రూ. 3,129 కోట్లు, రాగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు.