
‘బాండ్లు చెల్లించలేని అమాయకులకు అండగా నిలవాలనే'
న్యూఢిల్లీ: ఇది వ్యక్తిగత పోరాటం కాదని, బాండ్లు చెల్లించలేని స్థితిలో కారాగారాల్లో మగ్గుతున్న వందలాది మంది అమాయకులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే తమ అధినేత బాండ్ ఇవ్వకుండా ఉండిపోయారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఆప్ ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్ణయానికి కట్టుబడినందువల్లనే తమ పార్టీ అధినేత మూడో రోజు కూడా కారాగారంలో గడపాల్సి వచ్చిందని పేర్కొంది. తమ పార్టీ అధినేత చర్య న్యాయవ్యవస్థను ఓ గట్టి సవాలు విసిరినట్టయ్యిందని పేర్కొంది. పరువునష్టం కేసుకు సంబంధించి బాండ్ సమర్పించపోవడంతో దిగువకోర్టు తమ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిం చడాన్ని ఆప్ హైకోర్టులో సవాలు చేయనుంది. కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల ఆరో తేదీదాకా కేజ్రీవాల్ తీహార్ కారాగారంలో ఉండనున్నారు.
మరోవైపు తీహార్ కారాగారంలో రాసిన లేఖను అధినేత అరవింద్ ఆదేశాల మేరకు ఆప్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలోని ప్రతి ఇంటికీ పంపిణీ చేయనున్నారు.