వీలైనంత త్వరగా వెళ్లిపోండి!
బ్రిటన్‌కు ఈయూ వ్యవస్థాపక దేశాల సూచన
నిబంధనల సరళతరానికి ఓకే
ఉన్నతవర్గాలపై కోపమే రెఫరెండం ఫలితమన్న నిపుణులు
లండన్: బ్రెగ్జిట్ రెఫరెండం ఫలితంతో.. బ్రిటన్ వీలైనంత త్వరగా కూటమి నుంచి వెళ్లిపోవాలని ఈయూ వ్యవస్థాపక దేశాలు తెలిపాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వ్యవస్థాపక దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, లగ్జెంబర్గ్, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాల విదేశాంగ మంత్రులు బెర్లిన్‌లో శనివారం సమావేశమయ్యారు. బ్రిటన్ కొత్త ప్రధాని వీలైనంత త్వరగా బాధ్యతలు తీసుకుని.. మిగిలిన ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ఫ్రాన్స్ సూచించింది. కూటమినుంచి తప్పుకునేందుకున్న సంక్లిష్ట విధానాలను వీలైనంత సరళతరం చేసి.. తొందరగా బ్రిటన్ వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవటంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ వివాదంపై ఎక్కువ సమయం కేటాయించకుండా.. ఈయూను మరింత ఉజ్వలంగా మార్చే ప్రయత్నాలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. కామెరాన్ వీలైనంత త్వరగా కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలన్నారు. కాగా, తాజా ఫలితంతో ఈయూలో యూకే కమిషనర్ రాజీనామా చేశారు.
ఉన్నత వర్గంపై కోపానికి ఫలితమిది
బ్రెగ్జిట్ రెఫరెండం ఫలితం.. బ్రిటన్‌లో పేద, ఉన్నత వర్గాల మధ్య స్పష్టమైన విభజన రేఖను సూచిస్తోందని.. రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక ఫలాలు పేదలవరకు చేరకపోవటం, కాందిశీకుల సమస్య కారణంగానే మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్‌కే మొగ్గు చూపారన్నారు. యూకే భౌగోళిక పరిస్థితులతో అమెరికాకున్న పోలికల కారణంగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూల ఫలితం ఉండొచ్చని మరికొందరి వాదన.
‘మరోసారి రెఫరెండం’ డిమాండ్
కాగా, మరోసారి బ్రెగ్జిట్ రెఫరెండం పెట్టాలనే డిమాండ్ లండన్ పరిసరాల్లో ఊపందుకుంది. దీనికి మద్దతుగా పదిలక్షల మంది సంతకాలు చేశారు. ‘మొత్తం రెఫరెండం ఓటింగ్ 75 శాతానికన్నా తక్కువగా ఉండటం.. అందులో 60 శాతానికికన్నా తక్కువగా ఉండటం వల్ల కొత్తగా రెఫరెండం నిర్వహించాలన్న నిబంధనను బ్రిటన్ ప్రభుత్వం అమలుచేయాలి’ అని డిమాండ్ చేశారు.