Bregjit referendum
-
పార్టీ నాయకత్వానికి మే రాజీనామా
లండన్: బ్రెగ్జిట్ ఒప్పందంపై ఏకాభిప్రాయ సాధనకు మూడేళ్ల పాటు అటు ప్రతిపక్షాలతో ఇటు సొంత పార్టీలోని అసమ్మతివాదులతో పోరాడి ఓడిన బ్రిటన్ ప్రధాని థెరీసా మే గతంలో (మే 23న) చెప్పిన ప్రకారం శుక్రవారం కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. కొత్త ప్రధాని వచ్చేంత వరకు ఆమె తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారు. కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియ సోమవారం మొదలుకానుంది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని అమలు పరచలేకపోయానన్న బాధ ఎప్పటికీ ఉంటుందని మే 23వ తేదీన చేసిన ప్రసంగంలో థెరీసా భావోద్వేగం వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా వారసునిపై ఉంది. పార్లమెంటులో ఏకాభ్రిప్రాయం సాధించడం ద్వారానే వారు దీన్ని సాధించగలరు. బలమైన, సుస్థిర నాయకత్వంతో బ్రిటిష్ సమాజంలోని అన్యాయాలపై పోరాటమే తన కర్తవ్యమని ప్రకటించి ప్రధాని పదవి చేపట్టిన థెరీసాకు బ్రెగ్జిట్ పుణ్యమా అని ఆ అవకాశమే లభించలేదు.ç పదవిలో ఉన్న మూడేళ్లూ బ్రెగ్జిట్తోనే సరిపోయింది. 2016లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఆ నేపథ్యంలో ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవీచ్యుతుడవడంతో థెరీసా ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఈయూతో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంటులో నెగ్గించుకోవడానికి, ఏకాభిప్రాయ సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేతలను కూడా బుజ్జగించేందుకు విఫలయత్నం చేశారు. అయితే, మూడుసార్లు పార్లమెంటులో జరిగిన ఓటింగులో థెరీసా ఒప్పందం వీగిపోయింది. 2017లో జరిగిన ఎన్నికల్లో థెరీసా పార్లమెంటులో మెజారిటీ కూడా కోల్పోవడంతో బ్రెగ్జిట్ భవిష్యత్తు మరింత సంక్లిష్టమయింది. వరుసగా మూడో సారి కూడా పార్లమెంటులో ఒప్పందం వీగిపోయింది. ఫలితంగా 62 ఏళ్ల థెరీసా రాజీనామాకు సిద్ధపడ్డారు. ప్రధాని పదవికి పోటీలో 11 మంది ప్రధాని పదవి కోసం 11 మంది పోటీ పడుతున్నారు. ప్రధాని పదవి కోసం పోటీ చేసే అభ్యర్థి కనీసం 8 మంది ఎంపీల మద్దతు చూపించాల్సి ఉంటుంది. జూన్ 13, 18, 19 తేదీల్లో జరిగే రహస్య బ్యాలెట్లో పార్టీ ఎంపీలు ఓటు వేస్తారు. జూన్ 22 న కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉంది. -
‘బ్రెగ్జిట్’కు పార్లమెంటులో చుక్కెదురు
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే అంశంలో(బ్రెగ్జిట్) తుది ఒప్పందాన్ని నిలుపుదల లేదా జాప్యం చేసేందుకు పార్లమెంటుకు అధికారాలు కట్టబెడుతూ రూపొందించిన ఈయూ (సవరణ) బిల్లుకు ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ గురువారం ఆమోదం తెలిపింది. బ్రిటన్ ఎగువ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 355, వ్యతిరేకంగా 244 ఓట్లు పడ్డాయి. దీంతో ఈయూతో మరోసారి చర్చలు జరపమని బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు పార్లమెంటుకు అధికారం ఏర్పడుతుంది. అలాగే తుది ఒప్పందం నచ్చకపోతే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని కూడా నిలువరించవచ్చు. బ్రెగ్జిట్‌పై పార్లమెంటుకు ఎన్ని హామీలు ఇచ్చినా హౌస్ ఆఫ్ లార్డ్స్ సవరణలకు అనుకూలంగా ఓటు వేయడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని బ్రిటన్ మంత్రి మార్టిన్ కల్లనాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
బ్రిటన్ లేకుండానే ఈయూ మీటింగ్
బ్రసెల్స్: బ్రెగ్జిట్ రెఫరెండం తర్వాత తొలిసారిగా జరిగిన యురోపియన్ నేతల సమావేశం బుధవారం బ్రసెల్స్‌లో నిర్వహించారు. భేటీలో బ్రిటన్ ప్రతినిధి లేకపోవటం 40 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ సమావేశంలో బ్రిటన్ను వీలైనంత త్వరగా పంపిచేయాలని సభ్యులంతా నిర్ణయించారు. బ్రిటన్ను పంపించేందుకు నిబంధనలను సరళీకృతం చేయటం ద్వారా.. ఇతర దేశాలు కూటమినుంచి పోయేందుకు అనుమతిచ్చినట్లే అవుతుందనే అంశంపైనా ఈ భేటీలో చర్చ జరిగింది. అయితే బ్రిటన్ వెళ్లిపోయినా తాము మాత్రం ఈయూలోనే ఉంటామంటున్న స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టుర్జియోన్ బ్రసెల్స్లోనే మకాం వేశారు. -
బ్రెగ్జిట్ బంగార్రాజు
బ్రెగ్జిట్ రెఫరెండం తో బెట్టింగ్ రూపంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారా యి. మెజారిటీ సర్వేలు ఈయూలోనే బ్రిటన్ ఉంటుందని వెల్లడించినా.. లండన్‌కు చెందిన ప్రముఖ హెడ్జ్ ఫండ్ సంస్థ బాస్ క్రిస్పిన్ ఓడే (57) మాత్రం బ్రిటన్ విడిపోతుందని బలంగా నమ్మాడు. అందుకు తగ్గట్లుగానే బెట్టింగ్ కట్టి 220 మిలియన్ పౌండ్ల (రూ.2 వేలకోట్లకు పైనే) జాక్‌పాట్ కొట్టాడు. క్రిస్పిన్ బంగారంపై ఇన్వెస్ట్ చేయటంతోపాటు, పౌండ్ ధర తగ్గటంపై బెట్టింగ్ కట్టాడు. అయితే బ్రెగ్జిట్ ఫలి తంతో బంగారం డిమాండ్ పెరగటం, పౌండ్ 31 ఏళ్ల కనిష్టానికి తగ్గటం జరిగిపోయాయి. దీంతో క్రిస్పిన్ పంట పండింది. -
వీలైనంత త్వరగా వెళ్లిపోండి!
బ్రిటన్‌కు ఈయూ వ్యవస్థాపక దేశాల సూచన నిబంధనల సరళతరానికి ఓకే ఉన్నతవర్గాలపై కోపమే రెఫరెండం ఫలితమన్న నిపుణులు లండన్: బ్రెగ్జిట్ రెఫరెండం ఫలితంతో.. బ్రిటన్ వీలైనంత త్వరగా కూటమి నుంచి వెళ్లిపోవాలని ఈయూ వ్యవస్థాపక దేశాలు తెలిపాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వ్యవస్థాపక దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, లగ్జెంబర్గ్, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాల విదేశాంగ మంత్రులు బెర్లిన్‌లో శనివారం సమావేశమయ్యారు. బ్రిటన్ కొత్త ప్రధాని వీలైనంత త్వరగా బాధ్యతలు తీసుకుని.. మిగిలిన ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ఫ్రాన్స్ సూచించింది. కూటమినుంచి తప్పుకునేందుకున్న సంక్లిష్ట విధానాలను వీలైనంత సరళతరం చేసి.. తొందరగా బ్రిటన్ వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవటంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ వివాదంపై ఎక్కువ సమయం కేటాయించకుండా.. ఈయూను మరింత ఉజ్వలంగా మార్చే ప్రయత్నాలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. కామెరాన్ వీలైనంత త్వరగా కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలన్నారు. కాగా, తాజా ఫలితంతో ఈయూలో యూకే కమిషనర్ రాజీనామా చేశారు. ఉన్నత వర్గంపై కోపానికి ఫలితమిది బ్రెగ్జిట్ రెఫరెండం ఫలితం.. బ్రిటన్‌లో పేద, ఉన్నత వర్గాల మధ్య స్పష్టమైన విభజన రేఖను సూచిస్తోందని.. రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక ఫలాలు పేదలవరకు చేరకపోవటం, కాందిశీకుల సమస్య కారణంగానే మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్‌కే మొగ్గు చూపారన్నారు. యూకే భౌగోళిక పరిస్థితులతో అమెరికాకున్న పోలికల కారణంగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూల ఫలితం ఉండొచ్చని మరికొందరి వాదన. ‘మరోసారి రెఫరెండం’ డిమాండ్ కాగా, మరోసారి బ్రెగ్జిట్ రెఫరెండం పెట్టాలనే డిమాండ్ లండన్ పరిసరాల్లో ఊపందుకుంది. దీనికి మద్దతుగా పదిలక్షల మంది సంతకాలు చేశారు. ‘మొత్తం రెఫరెండం ఓటింగ్ 75 శాతానికన్నా తక్కువగా ఉండటం.. అందులో 60 శాతానికికన్నా తక్కువగా ఉండటం వల్ల కొత్తగా రెఫరెండం నిర్వహించాలన్న నిబంధనను బ్రిటన్ ప్రభుత్వం అమలుచేయాలి’ అని డిమాండ్ చేశారు.