
మెమన్‌కు న్యాయం జరగాలంటే తప్పేంటి..?
ముంబై పేలుళ్లలో అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదాన్ని సమర్థించడం లేదు. కోర్టు తీర్పులను గౌరవించాం.
మత ప్రాతిపదికన శిక్షలు వద్దు: అసదుద్దీన్
హైదరాబాద్: ‘‘ ముంబై పేలుళ్లలో అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదాన్ని సమర్థించడం లేదు. కోర్టు తీర్పులను గౌరవించాం. గౌరవిస్తాం, మత ప్రాతిపదికన శిక్షల అమలు వద్దు. యాకుబ్ మెమన్ విషయంలో న్యాయం జరగాలి. అతని స్థానంలో హిందువు ఉన్నా.. గళం విప్పుతా..? తప్పేంటి?’’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఖిల్వాత్ మైదానంలో పార్టీ మాజీ అధ్యక్షుడు, దివంగత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ 7వ వర్థంతి సందర్భంగా శనివారం అర్ధరాత్రి జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ప్రసంగించారు.
ఇటీవల మక్కామసీదులో రంజాన్ జూమ్మతుల్ విదా పురస్కరించుకొని తాను చేసిన వ్యాఖ్యలను కాషాయ వాదులు తప్పుబడుతున్నారని, వారం రోజుల తర్వాత జాతీయ మీడియా దాన్ని చిలువలు పలువలు చేస్తోందని విమర్శించారు. యాకుబ్ మెమన్‌పై సీనియర్ జర్నలిస్టు జగన్నాథం రాసిన కథనం, ముంబై పేలుళ్లపై విచారణ జరిపిన ఇంటెలిజెన్స్ చీఫ్ రామన్ నివేదికల్లోని అంశాలనే తన ప్రసంగంలో ఉదహరించానన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మజ్లిస్‌ను తక్కువ అంచనా వేసి అవాకులు, చవాకులు పేలుతున్నారనీ, మతతత్వవాదులని విమర్శిస్తున్నారని అసదుద్దీన్ దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మజ్లిస్ పార్టీ మద్దతు కోసం అప్పట్లో దివంగత నేత ఇందిరా గాంధీ దారుస్సలాం రాక తప్పలేదని, తిరిగి అదే చరిత్ర కాంగ్రెస్ నేతలకు పునరావృతం కాక తప్పదన్నారు.