
ఆడి కొత్తకారు ధర ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ మేకర్ ఆడి సరి కొత్త కార్ ను లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆడి అత్యంత విజయ వంతమైన లగ్జరీ సెడాన్ బీ9 వెర్షన్ కు చెందిన సెడాన్ ఎ4 ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరలను రూ. 38.1లక్షల నుంచి రూ 41.2 లక్షలు(ఢిల్లీ, మహారాష్ట్రలలో ఎక్స్ షో రూం ధరలు)గా కంపెనీ ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని దీన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 2,000 సీసీ ఇంజిన్ సామర్థ్యం అంతకంటే ఎక్కువ డీజిల్ కార్లు ఎస్ యూవీలపై సుప్రీంకోర్టు ఎనిమిది నెలల నిషేధం తమకు కలిసి వచ్చే అంశమని ఆడి తెలిపింది. అలాగే తరువాతి త్రైమాసికంలో ఆడి వాహనాల విక్రయాల్లో వృద్ధిని సాధిస్తామని ఆడి ఇండియా హెడ్ జోయ్ కింగ్ పీటీఐకి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రస్తుత అన్ని మోడళ్ల పెట్రోల్ వెర్షన్లు లాంచ్ యోచిస్తున్నామన్నారు. మార్కెట్లో డిమాండ్ అనుగుణంగా తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నట్టు చెప్పారు.
టీఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్, 150 హెచ్‌పీ పవర్ కెపాసిటీతో వస్తున్న ఈ సరికొత్త సెడాన్ గంటకు 250 కి.మీవేగంతో దూసుకుపోతుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ , ఈయూ 6 ఎమిషన్ క్లాస్ వస్తున్న ఈ కారులో పర్యావరణనాశనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ఆడీ ఆల్ వీల్స్ క్వాట్రో టెక్నాలజీ ఇందులో లేదు.