అమెరికా అధ్యక్ష పదవిపై ఒబామా జోస్యం
అమెరికా అధ్యక్ష పదవిని మహిళ చేపట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు సాక్షాత్తూ ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా. దేశాధ్యక్ష పదవిని మహిళ చేపడుతుందని ఒబామా జోస్యం చెప్పారు. ఆ పదని ఆమె అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. శుక్రవారం మీడియా సంస్థ ఏబీసీ బ్రాడ్ కాస్టర్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడారు. యూఎస్లో దేశవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటూ కొనియాడారు.
అలాగే మహిళలు రాజకీయ రంగంలో వివిధ పదవులను చేపట్టి ఆ పదవులకే వన్నె తెస్తున్నారంటు ప్రశంసించారు. మహిళలు దేశ రాజకీయాల్లో ముందుకు దూసుకువెళ్తున్న తీరును ఈ సందర్బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒబామా వ్యాఖ్యలు దేశంలో సంచలనాత్మకం రేకెత్తించాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్లు క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ ఉద్దేశించి ఒబామా పై విధంగా స్పందించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడ్డుతున్నారు.
గతంలో ఒబామా ప్రభుత్వంలో హిల్లరి క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. 2016 ఏడాదిలో యూఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ పదవికి కోసం హిల్లరీ ఎన్నికల బరిలోకి దిగుతారని ఊహగానాలు ఊపందుకున్నాయి. అయితే న్యూజెర్సీ గవర్నర్ రిపబ్లికన్ పార్టీ చెందిన చరీస్ క్రిస్టీతో హిల్లరీ క్లింటన్ ఓ ఒప్పందం చేసుకున్నట్లు క్వీన్పియక్ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడించింది. రిపబ్లికన్ ప్రత్యర్థులు సెనెటర్లు అయిన రాండ్ పాల్, టెడ్ క్రూజ్లతోపాటు కాంగ్రెస్మెన్ పాల్ రయన్ కంటే హిల్లరీ క్లింటన్ 9 పాయింట్లు అధిక్యంగా ఉన్నట్లు ఆ సర్వే నివేదిక ఈ నెల 13న ప్రచురించిన నివేదికలో పేర్కొంది.