దేశరాజధాని ఢిల్లీలోని కేరళ భవన్ క్యాంటీన్‌లో గోమాంసం వడ్డిస్తున్నారంటూ చెలరేగిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది.
కేరళ భవన్‌లో ఢిల్లీ పోలీసుల హల్‌చల్
క్యాంటీన్‌లో వడ్డించింది గేదె మాంసమన్న కేరళ ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కేరళ భవన్ క్యాంటీన్‌లో గోమాంసం వడ్డిస్తున్నారంటూ చెలరేగిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది. క్యాంటీన్‌లో హిందూ సేన కార్యకర్తలు, ఢిల్లీ పోలీసులు హంగామా చేయటంతో వివాదం రేగింది. ఈ ఘటన కేరళ భవన్‌లో సోమవారం సాయంత్రం హిందూసేన కార్యకర్తలు ప్రవేశించి ఆందోళన చేయటంతో మొదలైంది. కేరళ భవన్ క్యాంటీన్ మెనూలో బీఫ్ కూడా ఉంది. మిగతా ఆహార పదార్థాల పేర్లన్నీ ఇంగ్లీష్‌లో ఉండి బీఫ్ పేరును మలయాళంలో పేర్కొన్నారు. విషయాన్ని తెలుసుకున్న హిం దూసేన కార్యకర్తలు కేరళ భవన్‌లోకి ప్రవేశించి బీఫ్ వండకూడదంటూ ఆందోళన చేశారు. కేరళభవన్ సిబ్బంది పోలీస్ కంట్రోల్‌రూమ్‌కి సమాచారమిచ్చారు. దీంతో 20మంది పోలీసు లు కేరళభవన్‌కు చేరుకున్నారు. అప్పటికే హిందూసేన కార్యకర్తలు పారిపోయారు. అయితే పోలీసులు క్యాంటీన్‌లోకి వెళ్లి గోమాం సం వండారా లేదా అని పరిశీలించటం, సిబ్బందిని ప్రశ్నించటంతో దుమారం రేగింది.
అది గేదె మాంసం: తాము క్యాంటిన్‌లో వడ్డిస్తున్నది గోమాంసం కాదని, గేదె మాంసమని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీజీ థామ్సన్ స్పష్టం చేశారు. రెసిడెంట్ కమిషనర్ అనుమతి లేకుండా కేరళ భవన్‌లోకి చొరబడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి: ఊమెన్‌చాందీ
గోమాంసం వడ్డిస్తున్నారన్న ఆరోపణలపై కేరళభవన్‌పై దాడి చేయటం దారుణమని ఢిల్లీ పోలీసులపై, దుండగులపై కఠిన చర్యలు తీసు కోవాలని కేరళ సీఎం ఊమెన్ చాందీ ప్రధానికి లేఖ రాశారు. కాగా, ఢిల్లీ పోలీసులు కేరళభవన్‌పై దాడి చేయనే లేదని, ఆందోళన జరుగుతోందంటూ అక్కడి సిబ్బంది నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు వెళ్లారని, ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ అన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్య తీసుకుంటామన్నారు.