కోకాకోలా, పెప్సీలకు కోర్టులో ఊరట
శీతల పానీయాల కంపెనీలు కోకా కోలా, పెప్సీలను బహిష్కరించాలని అక్కడి వర్తకులు నిర్ణయించుకున్న మర్నాడే.. ఆ కంపెనీలకు మద్రాసు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కంపెనీలు తమిరపరని నది నుంచి నీళ్లను తీసుకుని వాడుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. స్థానికుల నిరసన కారణంగా గత నాలుగు నెలలుగా ఈ కంపెనీలు ఆ నది నీళ్లను వాడుకోలేకపోతున్న విషయం తెలిసిందే. నది నీళ్లను రసాయన అవసరాల కోసం ఈ కంపెనీలు వాడుకోవడం వల్ల వేలాది మంది రైతులు నష్టపోతున్నారని పిటిషనర్ వాదించారు. అయితే తాము కేవలం మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నట్లు కంపెనీలు తెలిపాయి.
కూల్‌డ్రింకు కంపెనీలు నది నీళ్లను వాడుకోవడాన్ని నిరసిస్తూ 2015లో జరిగిన ఘర్షణలలో పలువురు గాయపడ్డారు. అయితే తాము ప్రభుత్వ పారిశ్రామిక ఎస్టేటులోనే ప్లాంట్లు పెట్టుకున్నామని, అనవసరంగా తమను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కంపెనీలు వాదించాయి. ప్రతిరోజూ ఈ కంపెనీలు 9 లక్షల లీటర్ల నీళ్లను తీసుకోడానికి అనుమతి ఉన్నా, ఆ తర్వాత రెట్టింపు తీసుకుంటున్నాయని, వాటికి ప్రతి వెయ్యి లీటర్లకు రూ. 37.50 మాత్రమే తీసుకుంటున్నారని పిటిషనర్ డీఏ ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పుడు కోర్టు నుంచి ఆ కంపెనీలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే.. ఈ మధ్యలోనే వాటిని బహిష్కరించాలని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న వర్తక సంఘాలు నిర్ణయించాయి.