
దొంగ దొరికాడు.. కానీ 14 కేజీల బంగారం..
పాట్నా: గుజరాత్ వ్యాపారవేత్తకు చెందిన 14 కేజీల బంగారాన్ని దొంగిలించిన దొంగ అర్జున్ రామ్ను అరెస్ట్ చేసినట్లు బీహార్ పోలీసు ఉన్నతాధికారి శుక్రవారం వెల్లడించారు. అతన్ని అరెస్ట చేసి పోలీసు స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన వ్యాపారవేత్త షాపులో అర్జున్ రామ్ పని చేసేవాడు. అదను చూసి షాపు నుంచి గతేడాది 14 కేజీల బంగారాన్ని అపహరించి పరారైయ్యాడు. దాంతో వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో అర్జున్ రామ్ స్వగ్రామం రోహతక్ జిల్లాలోని దుమారియా గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే అతడి నుంచి 14 కేజీల బంగారం మాత్రం స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు. దీనిపై అతడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కానీ దొంగను పట్టుకుంటే పోలీసులకు రూ. లక్ష నజరానా ఇస్తానని వ్యాపారవేత్త ముందే ప్రకటించారు. వ్యాపారవేత్త మాత్రం ముందుగా ప్రకటించినట్లు పోలీసులకు రూ. లక్ష నజరానా అందజేశారు.