17 కిలోమీటర్లకు బస్సు చార్జీ.. ఒక్క రూపాయే! | biogas from cow dung makes bus fares far cheap | Sakshi
Sakshi News home page

17 కిలోమీటర్లకు బస్సు చార్జీ.. ఒక్క రూపాయే!

Published Sat, Apr 1 2017 12:55 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

17 కిలోమీటర్లకు బస్సు చార్జీ.. ఒక్క రూపాయే!

17 కిలోమీటర్లకు బస్సు చార్జీ.. ఒక్క రూపాయే!

ఆవులను పెంచడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని మనకు ఇన్నాళ్లుగా తెలుసు. అయితే ఇప్పుడు ఓ సరికొత్త ప్రయోజనం కూడా ఉందని కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ నిరూపించింది. ఆవు పేడ నుంచి తయారుచేసిన బయో గ్యాస్‌తో బస్సులను నడిపిస్తున్నారు. దానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. సాధారణంగా డీజిల్‌తో నడిపించే బస్సులకు లీటర్ డీజిల్‌తో మహా అయితే నాలుగైదు కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజి రాదు. డీజిల్ ధర లీటరు 60 రూపాయలకు పైనే ఉంది. కానీ ఇప్పుడు వీళ్లు కనుగొన్న కొత్త పద్ధతిలో బయో గ్యాస్‌తో బస్సు నడిపితే.. 17 కిలోమీటర్లకు ఒక్కో ప్రయాణికుడికి ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుందట. తాజాగా ఈ బస్సును కోల్‌కతా నగరంలో ఉత్తరాన ఉన్న ఉల్టాదంగా నుంచి దక్షిణాన ఉన్న గరియా వరకు నడిపించారు. ఈ ప్రయాణంలో మొత్తం 17.5 కిలోమీటర్ల దూరానికి లెక్క కడితే ఒక్కో ప్రయాణికుడికి ఒక్క రూపాయే ఖర్చయింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత చవకైన ప్రజారవాణా వ్యవస్థ ఇదేనని అంటున్నారు. ఢిల్లీలో బస్సులను సీఎన్‌జీతో నడిపించినా కూడా కిలోమీటరకు దాదాపు నాలుగైదు రూపాయలు చార్జీ అవుతోంది.

ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గ్రూప్ అనే ఈ కంపెనీ ఆవు పేడ నుంచి బయోగ్యాస్ తయారుచేసింది. ఈ సంస్థ అశోక్ లేలాండ్ కంపెనీతో చేతులు కలిపింది. 54 సీట్లున్న బస్సును రూ. 13 లక్షలకు అందించారు. ఇలాంటివి సుమారు 15 బస్సులను త్వరలోనే కోల్‌కతాలో నడిపిస్తామని చెబుతున్నారు. అన్నింటిలోనూ ఒకే తరహా చార్జీలు ఉంటాయి. జంతువులు, వృక్షాల వ్యర్థాల నుంచి మీథేన్‌తో కూడిన బయోగ్యాస్ తయారవుతుంది. ఇది ప్రమాదరహితం, రంగులేని గ్యాస్. దీన్ని వాహనాలకు, విద్యుత్ ఉత్పత్తికి, వంటకు కూడా ఉపయోగించవచ్చు. ఇది పర్యావరణ అనుకూలమైన ఇంధనం.

ప్రస్తుతం తాము బీర్భూమ్ జిల్లాలోని తమ ప్లాంటులో ఆవు పేడ నుంచి బయోగ్యాస్ తయారుచేస్తున్నామని, దీన్ని ట్యాంకర్ల ద్వారా కోల్‌కతా తరలిస్తున్నామని ఫోనిక్స్ ఇండియా గ్రూపు సీఎండీ జ్యోతి ప్రకాష్ దాస్ తెలిపారు. బయోగ్యాస్ ఉత్పత్తికి కిలో రూ. 20 చొప్పున ఖర్చవుతుంది. కిలో గ్యాస్‌తో బస్సు 5 కిలోమీటర్లు నడుస్తుంది. దాస్ బోటనీలో పీహెచ్‌డీ చేశారు. గత 8 ఏళ్లుగా బయో గ్యాస్ మీద పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు తాము జర్మనీ సంస్థ నుంచి సాంకేతిక పరిజ్ఞానం తీసుకుని, కిలో గ్యాస్‌తో 20 కిలోమీటర్లు నడిచేలా చూస్తున్నామని అన్నారు. ట్యాంకులో 80 కిలోల గ్యాస్ పడుతుందని, దాన్ని ఫుల్ చేస్తే 1600 కిలోమీటర్లు వెళ్తుందని, అందుకే చార్జీలు బాగా తక్కువ ఉంటాయని ఆయన వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement