
ఆమిర్ వ్యాఖ్యలపై దుమారం
మద్దతిచ్చిన కాంగ్రెస్.. మండిపడిన బీజేపీ
♦ రామ్‌గోపాల్‌వర్మ, అనుపమ్ ఖేర్‌ల తీవ్ర నిరసన
♦ ఆమిర్ దేశం విడిచి వెళ్తే జనాభా తగ్గుతుందన్న బీజేపీ ఎంపీ
న్యూఢిల్లీ/ముంబై: భారత్‌లో అసహన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ బాలీవు డ్ స్టార్ ఆమిర్‌ఖాన్(50) చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్నే లేపాయి. అటు రాజకీయ రంగం నుంచి, ఇటు సినిమా రంగం నుంచి ఆమిర్‌పై సానుకూల, ప్రతికూల వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమిర్ వ్యాఖ్యలపై ఢిల్లీలోని న్యూ అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. ముంబైలోని ఆమిర్ నివాసం ముందు హిందూ సేన కార్యకర్తలు నిరసన తెలిపారు. దాంతో ఆమిర్‌కు ముంబై పోలీసులు భద్రత కల్పించారు. ఆమిర్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపగా.. బీజేపీ మండిపడింది. సినీరంగ ప్రముఖులు అనుపమ్ ఖేర్, రామ్‌గోపాల్ వర్మ ఆమిర్ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసించారు. ఇతర విపక్ష నేతలు ఆమిర్ వ్యాఖ్యలు సరైనవేనన్నారు. ఆమిర్ దేశం విడిచి వెళ్తే ఆ మేరకు జనాభాను తగ్గించినవాడవుతాడంటూ బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
హిందువును మించిన పొరుగు లేదు
ఆమిర్‌పై ఎదురుదాడికి బీజేపీ తమ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేస్‌ను రంగంలోకి దింపింది. ముంబైలో విలేకరుల సమావేశంలో హుస్సేన్ మాట్లాడుతూ.. ‘ఇండియా విడిచి ఆమిర్ ఏ దేశం వెళ్తాడు? ప్రపంచంలో భారత్‌ను మించిన దేశం లేదు.. భారతీయ ముస్లింకు హిందువును మించిన పొరుగు లేదు. యూరోప్‌లో, ముస్లిం దేశాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియదా? అసహనం ఎక్కడ లేదు? ప్రపంచమంతటా ఉంది’ అన్నారు. ‘మన దేశంలో కళాకారుడిని అతడి కులం ఆధారంగానో, మతం ఆధారంగానో అభిమానించరు. అతడి కళను చూసి ప్రేమిస్తారు’ అన్నారు. ఆమిర్‌కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మద్దతు తెలపడంపై స్పందిస్తూ.. భారత్‌లో అసహన వాతావరణం నెలకొందన్న ప్రచారంతో దేశాన్ని అప్రతిష్ట పాలుచేసేందు కు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. ‘మంత్రుల ముందు, బహిరంగవేదికపై ఆమిర్ ఆ విధంగా మాట్లాడగలగడమే దేశంలో భావ ప్రకటన స్వాతంత్య్రానికి, సహన శీలతకు సజీవ తార్కాణ’మని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.
ప్రపంచమంతా చెబుతున్నదే..: కాంగ్రెస్
ప్రభుత్వాన్ని విమర్శించే అందరినీ దేశభక్తి లేనివారనో, జాతి వ్యతిరేకులనో, దేశద్రోహులనో ముద్ర వేయడం సరికాదని.. అందుకు బదులుగా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోదీ ప్రభుత్వానికి హితవు చెప్పారు. ‘బీజేపీ సీనియర్ నేతల ముందు ఆమిర్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచమంతా, దేశమంతా చెబుతున్నవే.’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. ఆమిర్ వాస్తవ కఠిన పరిస్థితులపై ధైర్యంగా స్పందించారని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. ‘ఆమీర్‌ను అభినందిస్తున్నా. ఆయనన్న ప్రతీమాటా వాస్తవమే’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘కశ్మీర్ ఉగ్రవాదుల పోరులో ప్రాణాలర్పించిన కల్నల్ సంతోశ్ మహాదిక్ త్యాగం ఆమిర్ వ్యాఖ్యల కన్నా ముఖ్యమైంది’ అంటూ ఎన్సీపీ నేత శరద్‌పవార్ అన్నారు.
అతిగా ఉన్నాయి: మిల్ఖా సింగ్
చండీగఢ్: ప్రభుత్వ అవార్డులను వెనక్కివ్వడాన్ని ప్రముఖ అథ్లెట్, పద్మశ్రీ పురస్కార గ్రహీత మిల్ఖా సింగ్ తప్పుబట్టారు. సాధించిన విజయాల ప్రాతిపదికగా లభించిన పురస్కారాలను తిరిగివ్వడం సరికాదన్న మిల్ఖా.. అలాంటి చర్యలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపబోవన్నారు. వాటివల్ల ఏం సాధిస్తారని ప్రశ్నించారు. అసహనంపై ఆమిర్ చేసిన వ్యాఖ్యలు కాస్త అతిగా ఉన్నాయన్నారు.
ముస్లింలు దేశాన్ని వీడరు: ఒవైసీ
హైదరాబాద్: ఈ దేశ ముస్లింలు దేశాన్ని వదిలి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లరని.. భారతీయులుగా చెప్పుకునేందుకే గర్వపడతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సంఘ్ పరివార్ తాటాకు చప్పుళ్లకు భారత ముస్లింలు భయపడరన్నారు. ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు స్వాతంత్య్ర సమరయోధులను అవమానించే విధంగా ఉన్నాయన్నారు.
ఆ ముగ్గురు పాములు
ఆమిర్ వ్యాఖ్యలపై శివసేన మంత్రి రామ్‌దాస్ కదమ్ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఆమిర్, షారూఖ్, వెటరన్ హీరో దిలీప్ కుమార్..ఈ ముగ్గురు పాముల్లాంటివారని, వారి వ్యాఖ్యలు చూస్తోంటే.. పాముకు పాలు పోసి పెంచినట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఎంతో అభిమానించినా.. విశ్వాస ఘాతకులుగా వ్యవహరిస్తున్నారన్నారు.
అసహన ఇండియా ఎప్పుడైంది?: అనుపమ్ ఖేర్
ఆమిర్ ఖాన్ అనే స్టార్‌ను తయారు చేసింది ఇండియానే అని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. ‘ఏ దేశానికి వెళ్దామ ని మీ భార్య కిరణ్‌రావు సూచించింది. మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చింది ఈ దేశమేనని ఆమెకు మీరు చెప్పారా? ఇంతకన్నా దారుణ పరిస్థితులెదుర్కొన్న సమయంలోనూ దేశం విడిచి వెళ్లాలన్న ఆలోచన మీకు రాలేదని మీరు తనతో చెప్పలేదా?’ అని వరుస ట్వీట్లలో ప్రశ్నించారు. ‘మీరనే ఈ అసహన సమాజమే మిమ్మల్ని స్టార్‌ను చేసింద’ంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఆమిర్, సల్మాన్, షారూఖ్‌లను ప్రస్తావిస్తూ.. భారత్ అసహన దేశమే అయితే ముగ్గురు ముస్లింలు సూపర్ స్టార్‌లు కాలేకపోయేవారన్నారు. మరే ఇతర దేశంతో పోల్చినా.. భారత్ గొప్ప సహన శీల దేశమని వర్మ పేర్కొన్నారు. రిషీ కపూర్, రవీనా టాండన్, పరేశ్‌రావల్ తదితర ప్రముఖులు కూడా ఆమిర్ వ్యాఖ్యలపై స్పందించారు.