యూపీలో ఎవరు ఎవరితో కలుస్తారు?
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పూర్తిస్థాయి మెజారిటీ ఏ పార్టీకి రాదని ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ సూచిస్తుండటంతో ఆ రాష్ట్రంలో "హంగ్ అసెంబ్లీ" తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. ఆయా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నప్పటికీ పూర్తి మెజారిటీ దక్కడం లేదు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 403 స్థానాలకు గానూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాలు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ సాధించడం లేదు.
న్యూస్ ఎక్స్ - ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం యూపీలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించిన పెద్ద పార్టీగా అవతరించనుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ మేరకు బీజేపీకి 185, ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలకు 120, బీఎస్పీకి 90 ఇతరులకు 8 చొప్పున గెలుచుకోనున్నాయి. టైమ్స్ - వీఎమ్మార్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా ఇదే ఒరవడిలో ఫలితాలున్నాయి. బీజేపీ 190 - 210 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఎస్పీ-కాంగ్రెస్ కలిపి 110 - 130 స్థానాలు, బీఎస్పీ 57 - 74 సీట్లు, ఇతరులకు 8 సీట్లు గెలుచుకుంటాయి.
ఇదే ఒరవడిలో తుది వెళ్లడైతే మాత్రం యూపీలో హంగ్ తప్పదు. అతిపెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ పగ్గాలు చేపట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అధికారం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధపడుతుంది. అయితే ఆ పరిస్థితులను బట్టి బీజేపీ ఎవరి మద్దతు కూడగడుతుందన్నది మరో రెండు రోజులైతేగాని స్పష్టత రాకపోవచ్చు. మరోవైపు ఎస్పీ-కాంగ్రెస్ కూటమి వైఖరి ఎలా ఉంటుంది? బీఎస్పీ ఎటువైపు మొగ్గుతుందన్నది కూడా కీలకంగా మారనుంది.
ఇదే సరళిలో తుది ఫలితాలు వస్తే ఎస్పీ-కాంగ్రెస్, బీఎస్పీలు జత కడుతాయా? అలాంటి అవకాశాలు ఉంటాయా? అంటే బద్ధ శత్రువులైన ఎస్పీ, బీఎస్పీలు కలిసే అవకాశాలే ఉండవని చెబుతున్నాయి. పైపెచ్చు బలనిరూపణ చేసుకుంటామని బీజేపీ ముందుకొస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తొలి అవకాశం బీజేపీకే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దశలో కూడా రాజకీయ సమీకరణల్లో అనేక మార్పులు చోటుచేసుకోవచ్చు. ఏది ఏమైనా తుది ఫలితాలు వచ్చిన తర్వాత యూపీలో హంగ్ అసెంబ్లీ ఉంటుందా? ఉండదా అన్నది తేలుతుంది.
ఈ నెల 11 న ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అప్పటివరకు ఈ ఉత్కంఠ తప్పదు. ఒకవేళ ఫలితాలు ఇదే సరళిలో వెళ్లడైతే ఏ ఏ పార్టీల మధ్య పొత్తు, అవగాహన కుదురుతుందో తుది ఫలితాలను బట్టి ఉంటుంది. అయితే గతంలో 2015 లో జరిగిన బీహార్, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యాయి.