హెలికాప్టర్లను తిరిగిచ్చేస్తున్న బీజేపీ!
బీహార్ ఎన్నికల సంరంభంలో బీజేపీ ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పడం లేదు. ప్రస్తుత సమయంలో పార్టీల విషయంలో భిన్నమైన వ్యూహం అవసరమని బీజేపీ గ్రహించినట్లు తెలుస్తోంది. ఇంకా మూడుదశల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా పార్టీ ప్రచారానికి హెలికాప్టర్ల వాడకం అనూహ్యంగా తగ్గించుకుంది. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగాల్సిన తరుణంలో పార్టీ.. అద్దె హెలికాప్టర్ల సంఖ్యను తగ్గించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రెండోదశ ఎన్నికల సమయంలోనే బీజేపీ తన వ్యూహాలను పూర్తిగా మార్చి వేసింది. వార్తాపత్రికల్లో ప్రకటనల దగ్గరనుంచి.. బిల్ బోర్డుల వరకూ ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల బొమ్మలు కూడా ఎక్కడా కనపడకుండా స్థానిక నాయకులు జాగ్రత్త పడ్డారు. ఈ ఎన్నికలపై ప్రధాని ప్రభావం పడటం వల్ల అంతగా ప్రయోజనం ఉండదని, పూర్తిగా స్థానిక ఎన్నికలుగానే జరగాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికలకు విరుద్ధంగా ఈసారి ప్రచారం కోసం హెలికాప్టర్ల వాడకాన్ని భారీగా తగ్గించినట్లు కనిపిస్తోంది.
ఎన్నికల సమయంలో హెలికాప్టర్లను ప్రచారంకోసం రోడ్డుమార్గం సరిగా లేని ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు ఉపయోగిస్తుంటారు. మొదట్లో సుమారు 16 హెలికాప్టర్లను బీజేపీ కోసం అద్దెకు తీసుకుంది. అక్టోబర్ 16 రెండోదశ పోలింగ్ పూర్తయిన తరువాత ఐదు హెలికాప్టర్లను తిరిగి ఇచ్చేసినట్లు పాట్నా ఎయిర్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. రెండోదశ పోలింగ్ తర్వాత హెలికాప్టర్ల సంఖ్య తగ్గించినట్లు బీజేపీ బీహార్ శాఖ సీనియర్ నాయకుడు కూడా ధ్రువీకరించారు. అయితే ఎందుకన్న విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు.
బీహార్ లోని 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటిదశ ఎన్నికలు అక్టోబర్ 12న జరుగగా... రెండో దశలో మొత్తం 32 సీట్లకు ఎన్నికలు జరిగేందుకు నిర్దేశించారు. దుర్గాపూజ, మొహర్రం పండుగల కారణంగా ఎన్నికల షెడ్యూల్ లో బాగా దూరం ఏర్పడింది. మిగిలిన 162 నియోజకవర్గాల్లో అక్టోబర్ 28, నవంబర్1, నవంబర్ 5 తేదీల్లో ఎన్నికలు జరిపేందుకు ఖరారు చేయగా నవంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు.
రెండు ఇంజన్లు ఉన్న హెలికాప్టర్ అద్దెకు తీసుకోవాలంటే సుమారు గంటకు 1.8 లక్షలు... ప్లస్ 14 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. అదే సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ కు లక్ష రూపాయలతోపాటు సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ఎన్నికల సమయంలో ప్రముఖ నాయకులు సుమారు రోజుకు నాలుగు గంటలు ప్రచారం నిర్వహించాల్సి వస్తుంటుంది. మొదటి విడత ఎన్నికల సమయానికి రాజకీయ పార్టీలు దాదాపు 55 మిలియన్ల మంది ఓటర్లను కలిసేందుకు రెండు డజన్ల ప్రైవేట్ హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. బీజేపీ 16 మాత్రమే అద్దెకు తీసుకుంది. వీటిని పార్టీ స్టార్ ప్రచారకులు నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు.. ఓ డజను మంది బీహార్ కేంద్ర మంత్రుల ప్రచారం కోసం ఉపయోగించారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీల నేతలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (జేడీయూ), లాలు ప్రసాద్ (ఆర్జేడీ)తో పాటు... కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. ఈసారి కూడా ఈ పార్టీలు అవే హెలికాప్టర్లను వాడేందుకు నిర్ణయించుకున్నాయని పాట్నా ఎయిర్ పోర్ట్ అధికారి తెలిపారు.