అతి పెద్ద రాష్ట్రానికి సీఎం.. ఆ అదృష్టవంతుడెవరో?
జనాభా పరంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం.. ఉత్తరప్రదేశ్. అక్కడ బీజేపీ అత్యంత భారీ విజయాన్ని సాధించింది. 403 మంది సభ్యులన్న అసెంబ్లీలో బీజేపీ, మిత్రపక్షాల వాళ్లే 324 మంది ఉంటారు. అంత పెద్ద రాష్ట్రాన్ని పాలించే అవకాశం రావడమంటే.. ఒక రకంగా అదృష్టమే. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో రెండు రోజుల్లో తేలిపోతుంది. యూపీ రాజధాని లక్నోలో శనివారం జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆ అదృష్టవంతుడిని ఎంపిక చేస్తారు. మొత్తం 324 మంది ఎమ్మెల్యేలు ఆరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశమవుతారు.
పార్టీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు, భూపేంద్ర యాదవ్ ప్రత్యేక పరిశీలకులుగా ఆ సమావేశానికి వెళ్తారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, టెలికం మంత్రి మనోజ్ సిన్హా, లక్నో మేయర్ దినేష్ శర్మ.. ఇలా పలుపేర్లు ఈ రేసులో వినిపిస్తున్నాయి. కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతలను పార్టీ అధిష్ఠానం పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, యూపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్యలకు అప్పగించింది. దాంతో మౌర్య ఈ రేసు నుంచి తప్పుకొన్నట్లయింది. 'నన్ను నేనే ఎంపిక చేసుకోలేను కదా' అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అమిత్ షా కూడా.. 'కేశవ్ ఎవరి పేరు నిర్ణయిస్తే ఆ పేరు మీద ముద్ర కొట్టేస్తా' అని చెప్పారు. గతంలో కూడా యూపీ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో రాజ్‌నాథ్ సింగ్ పేరు గట్టిగా వినిపిస్తోంది.