ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వచ్చిన అతిథి
ఇండియానా: దాదాపు 140 సంవత్సరాల తర్వాత ఓ అతిథి ఇండియానా అడవులను పలకరించింది. దీంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. తిరిగి ఆ సంతతి తమ వద్ద పునరుత్పత్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ అతిథి ఎవరనీ అనుకుంటున్నారా. నల్లటి ఎలుగుబంటి. అవును.. 1871 నుంచి ఇండియానా అడవుల్లో ఎలుగు బంట్లు కరువై పోయాయట. అంతకుముందు కుప్పలుగా ఉన్న అవి ఉన్నపలంగా అంతరించిపోయి పూర్తిగా కనిపించడం మానేశాయి.
వారి వద్ద ఉన్న డేటా ప్రకారం.. 140 ఏళ్లుగా ఒక్క ఎలుగుబంటి కూడా తమ అడవుల్లో ఉన్నట్లు రికార్డుల్లో లేదు. తాజాగా దాని పాదముద్రలు, మల విసర్జన గుర్తించిన అధికారులు వచ్చింది మగ ఎలుగుబంటి అని, అది మిచిగాన్ ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, చాలాకాలం తర్వాత ఎలుగుబంట్లు కనిపించడంతో అక్కడి వారు చాలా ఆందోళన చెందుతున్నారట. ఎందుకంటే అవి చాలా క్రూరమైన జాతికి చెందినవి.