బ్రిటన్ యువరాజు చార్లెస్, కెమిల్లా పార్కర్ దంపతులు భారత పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఉత్తరాఖండ్లోని రుషికేశ్లో వేద పండితులు గంగానదికి ఇచ్చిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పరమత నికేతన్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇటీవల ఉత్తరఖండ్ వరదల్లో మరణించిన వారికి ఆత్మ శాంతి కలగాలని కోరకున్నట్లు చార్లెస్ గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. గంగా నదిని తన జీవితంలో మొట్టమొదటిసారిగా చూశానని, ఆ నది తీరంలో తన జీవితంలో కొంతసమయాన్ని వెచ్చించడం తనకు, భార్య పార్కర్కు ఓ చక్కని అనుభూతిని ఇచ్చిందని ఆయన ట్విట్టర్లో తెలిపారు.
భారత్లో తొమ్మిది రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం చార్లెస్ దంపతులు ఉత్తరఖండ్లోని జోలిగ్రాంట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆ దంపతులకు ఆ రాష్ట్ర సీఎం విజయ్ బహుగుణ్, భారత్లో బ్రిటన్ రాయబారి జేమ్స్ డేవిడ్లు స్వాగతం పలికారు. చార్లెస్ సతీ సమేతంగా భారత్లో ముచ్చటగా మూడోసారి పర్యటిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను కలుసుకుంటారు. అలాగే ముంబైలో ప్రముఖ పారిశ్రామివేత్తలతో భేటీ కానున్నారు. దానితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తు పారిశ్రమికవేత్తలు, సంస్కృతి నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నెల 14న కొలంబోలో జరిగే చోగమ్ సదస్సులో పాల్గొనేందుకు శ్రీలంక వెళ్లతారు.