సెన్సెక్స్ రికార్డు ముగింపు
బుధవారం ముగింపులో చిన్న ర్యాలీతో బీఎస్‌ఈ సెన్సెక్స్ కొత్త రికార్డును సృష్టించగలిగింది. 86 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 21,338 వద్ద ముగిసింది. గత డిసెంబర్ 9న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన ర్యాలీలో 21,484 పాయింట్ల చరిత్రాత్మక గరిష్టస్థాయికి పెరిగిన సూచి ఆ రోజున 21,326 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి అప్పటి రికార్డు ముగింపు 6,364 పాయింట్లు కాగా, తాజాగా 25 పాయింట్ల పెరుగుదలతో 6,339 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
ఎన్‌ఎస్‌ఈ సూచి కొత్త రికార్డును నెలకొల్పాలంటే మరో 25 పాయింట్ల దూరాన్ని ప్రయాణించాల్సివుంటుంది. తాజా మార్కెట్ ర్యాలీకి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో పాటు ఫార్మా, మెటల్ షేర్లు తోడ్పాటునందించాయి. సన్‌ఫార్మా 2.8%, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లాబ్ 1% పెరిగాయి. టాటా స్టీల్, హిందాల్కో, సేసా స్టెరిలైట్ షేర్లు 1-2% మధ్య పెరిగాయి. భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, మహీంద్రాలు 1%పైగా పెరిగాయి. ఎస్‌బీఐ, హీరో మోటార్ కార్ప్‌లు స్వల్పంగా తగ్గాయి. ఎఫ్‌ఐఐలు రూ. 279 కోట్ల నికర పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 90 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి.
6,300 స్ట్రయిక్ వద్ద పుట్ బిల్డప్..
నిఫ్టీ మద్దతుస్థాయి క్రమేపీ 6,200 నుంచి 6,300 స్థాయికి పెరిగినట్లు తాజా ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది. తాజాగా 6,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ ఆప్షన్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 8.47 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 62.85 లక్షల షేర్లకు పెరిగింది. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 2.69 లక్షల షేర్లు కట్‌కాగా, మొత్తం ఓఐ 45.32 లక్షల షేర్లకు దిగింది. 6,400 కాల్ ఆప్షన్లో స్వల్పంగా 1.68 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 49.09 లక్షల షేర్లకు పెరిగింది.