పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈనెలలోనే రెండో పర్యాయం కయ్యానికి కాలు దువ్వింది.
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈనెలలోనే రెండో పర్యాయం కయ్యానికి కాలు దువ్వింది. జమ్మూ సెక్టార్లో ఈ ఉదయం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గాయపడ్డాడు. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) సమీపంలో ఆల్ఫా మాకియర్ బోర్డర్ అవుట్ పోస్ట్ పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడిందని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాక్ కవ్వించినా తమ జవానులు సంయమనం పాటించారని పేర్కొన్నారు.
కాల్పుల్లో గాయపడిన జవాను పవన్ కుమార్ను ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 5న అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రామ్నివాస్ మీనా గాయపడిన సంగతి తెలిసిందే. అతడి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.
పూంచ్ జిల్లాలోని చకన్ దా బాగ్ సెక్టార్ పరిధిలోకి వచ్చే సార్లా ఫార్వర్డ్ పోస్ట్‌కు చెందిన ఐదుగురు సైనికులను పాకిస్థాన్ సైన్యం ఇటీవల కాల్చిచంపింది. నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి భారత జవాన్లు గస్తీ తిరుగుతుండగా ఈ దాడి జరిగింది. ఇది దేశవ్యాప్తంగాను, పార్లమెంటులోనూ తీవ్ర చర్చకు దారితీసింది.