ఉత్తరప్రదేశ్లోని శాంతి భద్రతలు మృగ్యమైనాయిని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాజ్యసభలో ఆ అంశంపై చర్చకు మాయావతి పట్టుపట్టారు. ఆ అంశంపై చర్చకు రాజ్యసభ చైర్మన్ అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ వెల్లోకి దూసుకెళ్లిన మాయావతితోపాటు ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజ్యసభ వెల్లోకి దూసుకువచ్చి అఖిలేష్ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. దాంతో రాజ్యసభలో కొద్దిపాటి గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభను 10 నిముషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఆగ్రహించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. యూపీలో ఇటీవల వరుస సామూహిక అత్యాచారాలు, బీజేపీ నాయకుడు హత్య నేపథ్యంలో యూపీలో శాంతి భద్రతలు అడుగంటాయని ఆమె ఆరోపించారు.